BRS BJP Merger Proposal | బీజేపీలో విలీనానికి కేటీఆర్‌ ప్రతిపాదన: బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌

బీజేపీలో విలీనం కోసం బీఆరెస్‌ ప్రయత్నాలపై గతంలో ఊహాగానాలు ఉన్నాయి. అయితే.. సాధికారికంగా ఈ విషయాన్ని కేసీఆర్‌ కుమార్తె కవిత ఇప్పటికే ధృవీకరించారు. తన కుమారుడిని ఆశీర్వదించాలని కేసీఆర్‌ స్వయంగా తనను కోరారని గతంలో ప్రధాని నరేంద్రమోదీ సైతం బాంబు పేల్చారు. తాజాగా విలీనం ప్రతిపాదన తన వద్దకు కేటీఆర్‌ తీసుకువచ్చారని సీఎం రమేశ్‌ చెప్పడంతో బీజేపీలో విలీనం అయ్యేందుకు లేదా దగ్గరయ్యేందుకు బీఆరెస్‌ నేతలు చాలా ప్రయత్నాలే చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

BRS BJP Merger Proposal | బీజేపీలో విలీనానికి కేటీఆర్‌ ప్రతిపాదన: బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌

BRS BJP Merger Proposal | హైదరాబాద్‌, జూలై 26 (విధాత) : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు ఆయనకే బూమరాంగ్‌ అయ్యాయన్న చర్చ జరుగుతున్నది. సీఎం రమేశ్‌ స్నేహితుడి కంపెనీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒక ప్రాజెక్టును కట్టబెట్టారని ఆరోపించడం ద్వారా సీఎంను ఇరకాటంలో పడేద్దామని కేటీఆర్‌ భావించారు. అయితే.. కేటీఆర్‌ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన సీఎం రమేశ్‌.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం కమలం పార్టీ అధిష్ఠానంతో రాయబారం నెరపాలని తన వద్దకు వచ్చారని రమేశ్‌ బాంబు పేల్చారు. ఈ విషయమై ఎక్కడైనా తాను చర్చకు సిద్దమని సవాల్‌ కూడా విసిరారు. కేటీఆర్‌, మరికొందరు తన నివాసానికి వచ్చిన సీసీ టీవీ విజువల్స్‌ మీడియాకు అందించేందుకు కూడా సిద్ధమని చెప్పటం ద్వారా రాజకీయ సంచలనం రేపారు.

కేటీఆర్‌ ఆరోపణలకు కౌంటర్‌

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ పోరాటం చేసింది. ఈ భూములను ఎవరూ కొనుగోలు చేయకూడదని కూడా కోరింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములను వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. అయితే కంచగచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్‌కు సీఎం రమేశ్ సహకరించారని కేటీఆర్ ఆరోపించారు. ఇందుకు ప్రతిఫలంగా సీఎం రమేశ్‌కు చెందిన రుత్విక్‌ కంపెనీకి రూ.1650 కోట్ల విలువైన కాంట్రాక్టును కట్టబెట్టారని అన్నారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య సంబంధాన్ని బట్టబయలు చేసిందన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపడం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. కేటీఆర్ ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. న్యూఢిల్లీలో ఈ విషయమై మీడియా ప్రతినిధులు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. టెండర్ ప్రక్రియలో పాల్గొని నిబంధనల ప్రకారం టెండర్ దక్కించుకోవడంలో తప్పేంటని ఎదురు ప్రశ్నించారు.

బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై రమేశ్‌ బాంబు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలపై తప్పనిసరిపరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సి వచ్చిందని సీఎం రమేశ్.. శనివారం విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రుత్విక్ కంపెనీలో తాను డైరెక్టర్‌ను కాదని స్పష్టత ఇస్తూ.. హైదరాబాద్‌లో రోడ్డు పనులకు సంబంధించి రుత్విక్ కంపెనీ పోటీపడి టెండర్ దక్కించుకుందని చెప్పారు. నామినేషన్ పద్దతిలో రూ.1650 కోట్ల కాంట్రాక్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తుపాకులగూడెం వద్ద ఇరిగేషన్ పనులను రుత్విక్ కంపెనీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అది కూడా టెండర్ ద్వారానే దక్కించుకున్నట్టు గుర్తు చేశారు. ఇక కేటీఆర్‌పై పెద్ద బాంబు విసిరిన రమేశ్‌.. కవిత జైల్లో ఉన్న సమయంలో తన వద్దకు వచ్చిన కేటీఆర్ అవసరమైతే బీజేపీలో బీఆరెస్‌ను విలీనం చేస్తామనే ప్రతిపాదించారని చెప్పారు. ఆ విషయాన్ని తాను బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించగా.. బీఆరెస్‌ విలీనం కాదు కదా.. ఆఖరుకు పొత్తు పెట్టుకునేందుకు కూడా అంగీకరించలేదని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఇప్పటికే అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో మళ్లీ ఆ పార్టీని విలీనం చేసుకున్నా, పొత్తు పెట్టుకున్నా.. రాజకీయంగా ఇబ్బంది అవుతుందని తమ నాయకత్వం భావించిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం కూడా ఆ పార్టీకి ప్రజల్లో స్థానం లేకుండా పోయిందని కమలం పార్టీ భావించిందని సీఎం రమేశ్ చెప్పారు. విలీనం ప్రతిపాదన చేసేందుకు అప్పట్లో తన ఇంటికి కేటీఆర్‌తోపాటు మరికొందరు వచ్చారని, అందుకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ మీడియాకు ఇచ్చేందుకు కూడా తాను సిద్దమేనని ప్రకటించారు. కేటీఆర్ ఆరోపణలతో పాటు తన వద్ద బీఆర్ఎస్ విలీనంపై కేటీఆర్ ప్రతిపాదన గురించి తాను ఎక్కడైనా చర్చకు సిద్దమని సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ రాజకీయంగా ఇరుకునపడిందా?

రుత్విక్ కంపెనీకి కాంట్రాక్టుల అంశం ద్వారా రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకునపెట్టాలని బీఆరెస్‌ భావిస్తే.. పరిస్థితి పూర్తిగా రివర్స్‌ అవడమే కాకుండా.. ఎదురుదెబ్బ తగిలినట్టయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీలో విలీనం కోసం బీఆరెస్‌ ప్రయత్నాలు చేసిందన్న విషయంలో గతంలో ఆరోపణలు, ఊహాగానాలు ఉన్నాయి. అయితే.. సాధికారికంగా ఈ విషయాన్ని కేసీఆర్‌ కుమార్తె కవిత ఇప్పటికే ధృవీకరించారు. తన కుమారుడిని ఆశీర్వదించాలని కేసీఆర్‌ స్వయంగా తనను కోరారని గతంలో సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీ సైతం బాంబు పేల్చారు. తాజాగా విలీనం ప్రతిపాదన తన వద్దకు కేటీఆర్‌ తీసుకువచ్చారని సీఎం రమేశ్‌ చెప్పడంతో బీజేపీలో విలీనం అయ్యేందుకు లేదా దగ్గరయ్యేందుకు బీఆరెస్‌ నేతలు చాలా ప్రయత్నాలే చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రమేశ్ పేల్చిన బాంబుపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.