BRS MLAs| ఇంకాసేపట్లో స్పీకర్ వద్ధకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు విచారణలో భాగంగా నేడు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలవబోతున్నారు.

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్(BRS)నుంచి కాంగ్రెస్లో(Congress) చేరిన 10మంది ఎమ్మెల్యే(Mlas)లు ఇంకాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)ను కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటారు. తమ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరారని, వారిపై అనర్హత చర్యలు తీసుకోవాలని గతంలోనే స్పీకర్‌కు బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ కు సూచించింది.
ఈ నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం 8 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చింది. బీఆర్‌ఎస్ ఇచ్చిన ఫిర్యాదులను జతచేస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ సమాధానం చెప్పాలని అడిగింది. అయితే తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని ఆ 8మంది ఎమ్మెల్యేలు తమ సమాధానాల్లో స్పష్టం చేశారు. ఈ సమాధానాలను పరిశీలించిన స్పీకర్.. దీనిపై మీకేమైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో తెలుపాలని మళ్లీ బీఆర్‌ఎస్ తరఫున పిటిషన్ వేసినవారికి నోటీసులిచ్చారు. మూడు రోజుల గడువు ముగియ్యడంతో బీఆర్ఎస్ పార్టీ తమ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ ఆధారాలను, ఫొటోలను స్పీకర్ కు నేడు సమర్పించేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో స్పీకర్ కార్యాలయంకు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు..ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు ఇరువర్గాలు కూడా చేరుకోనుండటంతో అక్కడ ఏం జరుగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.