సామేల్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి వ్యహారంపై కాంగ్రెస్ కోర్ కమిటీ సీరియస్

తెలంగాణ కాంగ్రెస్‌లో సామేల్-రాజగోపాల్ రెడ్డి వివాదంపై ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ సీరియస్‌గా చర్చించింది. ఖర్గే సమగ్ర నివేదిక కోరగా, డిప్యూటీ సీఎం అంశంపైనా కీలక చర్చ జరిగినట్లు సమాచారం.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ కీలక భేటీ సాగింది. ఈ భేటీలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య జరిగిన పరస్పర బహిరంగ విమర్శలపై సుదీర్ఘ చర్చ సాగింది. ఈ వివాదంపై సీరియస్ అయిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పార్టీని ఆదేశించారు. పార్టీ నాయకులు బహిరంగ వేదికలపై విమర్శలు చేసుకోవడం సరైంది కాదని తుంగతుర్తి ఎపిసోడ్ పై వెంటనే నివేదిక ఇవ్వాలని ఖర్గే స్పష్టం చేసినట్లుగా సమాచారం.

అలాగే డిప్యూటీ సీఎంగా రామచంద్ర నాయక్ ను ఎంపిక చేసినప్పటికి పదవీ ప్రమాణ స్వీకారం ఎందుకు జరుగలేదని ఖర్గే అసహనం వ్యక్తం చేశారని సమాచారం. రామచంద్ర నాయక్ ను పక్కన పెట్టి మరో ఎమ్మెల్యేను ఎంపిక చేసే విషయమై కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ నాయకత్వానికి ఖర్గే సూచించారు. నూతన డీసీసీల ఆమోదం, సర్ ప్రక్రియ, పార్టీ సంస్థాగత నియామకాలు, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై కూడా చర్చలు జరిగినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క , దామోదర్ రాజనర్సింహ, వంశీ చంద్ రెడ్డి హాజరయ్యారు.

Latest News