తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తేజస్వీ వ్యాఖ్యలు : హరీశ్, కేటీఆర్ ఫైర్

లోక్‌సభలో తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చిన తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై హరీశ్ రావు, కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వైఖరిపై ప్రశ్నించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తేజస్వీ వ్యాఖ్యలు : హరీశ్, కేటీఆర్ ఫైర్

విధాత, హైదరాబాద్ : లోక్ సభలో 131 రాజ్యాంగ సవరణ బిల్లు చర్చ సందర్భంగా కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితం అని, అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనని, అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమేనని స్పష్టం చేశారు. ఇది భారత సమాఖ్య స్ఫూర్తి పట్ల బీజేపీకి ఉన్న అజ్ఞానాన్ని సూచిస్తోంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందనడానికి తేజస్వి అహంకార పూరిత వ్యాఖ్యలే నిదర్శనం అని హరీశ్ రావు, కేటీఆర్ లు మండిపడ్డారు. బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి, తన పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని, లేదంటే ఇది బీజేపీ అధికారిక ధోరణిగానే ప్రజలు భావిస్తారని తెలిపారు. ఇండియా పాకిస్థాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటు అయితే ఆనాడు బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపింది? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ కూడా గతంలో అనేకసార్లు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారని గుర్తు చేశారు. నాడు మోడీ అయినా నేడు తేజస్వి సూర్య అయినా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. “రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తూ, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను సహించేది లేదు. తెలంగాణ చరిత్రను, గౌరవాన్ని కాపాడుకోవడానికి బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ ముందుంటుంది” అని హరీష్, కేటీఆర్ లు స్పష్టం చేశారు.

తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటు అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతేమిటో తేల్చేవారు అని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీలు అయినా కాంగ్రెస్ ఎంపీలైనా తెలంగాణ పాలిట దిష్టిబొమ్మలుగా మారారు అని విమర్శించారు. తెలంగాణ పేరుతో గెలిచి, తెలంగాణ అవమానాన్ని చూసి నిశ్శబ్దంగా కూర్చున్న ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఢిల్లీ పెద్దల ముందు వంగి, తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టే నాయకత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని వ్యాఖ్యానించారు. తెలంగాణను అవమానించే ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టి సమాధానం ఇస్తాం. రాష్ట్ర హక్కులు, ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులను తెలంగాణ ప్రజలు ఎన్నడూ అంగీకరించరు అని స్పష్టం చేశారు. తెలంగాణ అంటే పోరాటగాథ.. త్యాగాల చరిత్ర.. స్వాభిమానానికి ప్రతీక. దానిని అగౌరవపరిస్తే, అవమానిస్తే సహించేది లేదు అని హరీశ్ రావు, కేటీఆర్ లు తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి :

దేశ చరిత్రలో మహిళ రిజర్వేషన్ బిల్లు కీలక ఘట్టం: ప్రధాని మోదీ
సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానం మూర్ఖత్వం: ఎంపీ తేజస్వీ సూర్య ఫైర్