Lava Shark 2 | దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా భారత మార్కెట్‌లోకి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. షార్క్ సిరీస్‌లో భాగంగా Lava Shark 2 5G పేరుతో కొత్త హ్యాండ్‌సెట్‌ను మంగళవారం లాంచ్ చేసింది. గత ఏడాది విడుదలైన షార్క్ 4జీ మోడల్‌తో పోలిస్తే భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, మెరుగైన పనితీరు వంటి ఫీచర్లను అందించారు. ముఖ్యంగా తక్కువ ధరలోనే 5జీ మొబైల్‌ను కొనాలనుకునే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది.
లావా షార్క్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. ఇందులో 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఒకే ఒక్క వేరియంట్‌ను అందిస్తున్నారు. ఇది జూన్ 10వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. ఈ మొబైల్‌ను Arya Blue, Sonar Gold రంగుల్లో అందిస్తున్నారు.
ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది బ్లోట్‌వేర్ లేని, ప్రకటనలు లేని స్వచ్ఛమైన ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తుందని లావా కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుందని పేర్కొంది. ఈ మొబైల్‌కు ఒక ప్రధాన ఓఎస్ అప్‌డేట్‌తో పాటు రెండేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని వెల్లడించింది.
డిస్‌ప్లే విషయానికి వస్తే ఇది 6.75 అంగుళాల హెడ్‌డీ+LCD స్క్రీన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌రేట్‌ను సపోర్టు చేస్తుంది. దీనివల్ల స్క్రోలింగ్, వీడియోలు చూసేటప్పుడు, గేమింగ్ సమయంలో స్మూత్ అనుభవం అందించనుంది.
పనితీరు విషయానికి వస్తే ఈ ఫోన్ 6nm టెక్నాలజీ ఆధారిత ఆక్టా కోర్ యూనిసాక్ T8200 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్‌తో పాటు అదనంగా 4జీబీ వర్చువల్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ సపోర్టు ఉండటంతో మల్టీ టాస్కింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుందని లావా కంపెనీ తెలిపింది. అలాగే ఇందులో 64జీబీ స్టోరేజ్‌ను అందించారు.
ఫొటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 13మెగాపిక్సెల్ ఏఐ కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ధూళి, నీటి తుంపరల నుంచి రక్షణ కోసం దీనికి IP64 రేటింగ్ ఇవ్వడం విశేషం.
ఇందులో 6000mAh భారీ బ్యాటరీ అందించారు. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 13 గంటల 35 నిమిషాల వరకు యూట్యూబ్ ప్లేబ్యాక్ లేదా 12 గంటల 23 నిమిషాల స్క్రీన్ ఆన్ టైమ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ఇందులో 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో USB Type C పోర్టు ద్వారా వేగంగా చార్జ్ చేసుకునే సౌకర్యం కల్పించారు.
Read More:
ఒప్పో నుంచి మరో బడ్జెట్ మొబైల్.. ధర, ఫీచర్లు లీక్!
7560mAh భారీ బ్యాటరీ.. 100W ఫాస్ట్ చార్జింగ్‌తో రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..!
