Type-2 Diabetes | స్టెమ్ సెల్ థెరపీతో టైప్–2 డయాబెటిస్‌ రివర్స్‌.. చైనా కీలక ఆవిష్కరణ

ఇన్సూలిన్‌ను బయట నుంచి అందించకుండా టైప్‌–2 డయాబెటిస్‌ను రివర్స్‌ చేయడం సాధ్యమా? అవుననే అంటున్నారు చైనా శాస్త్రవేత్తలు. ఇన్సూలిన్‌పై ఆధారపడకుండా స్టెమ్‌ సెల్‌ థెరపీతో టైప్‌–2 డయాబెటిస్‌ను రివర్స్‌ చేశామని ప్రకటించారు.

Reported by: Jagan Mohan Talluri | సైన్స్​ – టెక్నాలజీ | Feb 27, 2026, 4:09 pm IST
Read Time: 7 mins
Type-2 Diabetes | స్టెమ్ సెల్ థెరపీతో టైప్–2 డయాబెటిస్‌ రివర్స్‌.. చైనా కీలక ఆవిష్కరణ

Type-2 Diabetes | ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న టైప్‌–2 డయాబెటిస్‌ (Type-2 Diabetes)కు చికిత్సలో చారిత్రక పరిణామం (Historic Development) చోటు చేసుకుంది. స్టెమ్‌సెల్‌ థెరపీ (Stem-Cell Therapy)ని ఉపయోగించి టైప్‌–2 డయాబెటిస్‌ను రివర్స్‌ చేయడంలో చైనా శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. ఇందుకోసం స్టెమ్‌సెల్‌ల నుంచి తయారు చేసిన ఆరోగ్యకరమైన ప్యాంక్రియాస్ కణాలను (Healthy Pancreatic Cells) రోగి శరీరంలోకి ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఇన్సూలిన్‌ ఉత్పత్తి చేసే బీటా కణాలను లాబొరేటరీలో ఉత్పత్తి చేసి.. అవి సహజ కణాల్లా పనిచేసేలా డెవలప్‌ చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో సంబంధిత రోగి.. ఇకపై ఇన్సూలిన్‌ (Insulin) ఇంజక్షన్లు లేదా ఔషధాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండానే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను నియంత్రించగలుగుతున్నట్టు ప్రకటించారు.

టైప్‌–2 డయాబెటిస్‌ అంటే ఏమిటి?

శరీరం ఇన్సూలిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేని పరిస్థితిని టైప్‌–2 డయాబెటిస్‌ అని పిలుస్తారు. మధుమేహ రోగులు సాధారణంగా ఇన్సూలిన్‌ లేదా ఇతర ఔషధాలపై ఆధారపడుతుంటారు. ఒకసారి ఇన్సూలిన్‌పై పూర్తిగా ఆధారపడితే.. శరీరం దానికి అలవాటుపడిపోయి.. సహజ నియంత్రణ వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడం కష్టమవుతుంది.

ఇలా చేశారు…

అవసరమైన ఇతర కణాలుగా మారగలిగే ప్రత్యేక స్టెమ్‌సెల్స్‌కు ఉంది. దీన్ని ఉపయోగించుకున్న శాస్త్రవేత్తలు రోగి లేదా దాత నుంచి స్టెమ్‌ సెల్స్‌ సేకరించారు. లాబొరేటరీలో ప్రత్యేక కెమికల్‌, జన్యు సంకేతాల సహాయంతో సదరు స్టెమ్‌ సెల్స్‌ను ప్యాంక్రియాస్‌లోని ఐలెట్‌ కణాలుగా.. ముఖ్యంగా ఇన్సూలిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలుగా మార్చారు. ఇలా మార్చిన కణాలను సమూహాలుగా పెంచి.. ఆరోగ్యకరమైన ప్యాంక్రియాస్‌ నిర్మాణాన్ని అనుకరించేలా తయారు చేశారు. ఈ కణ సమూహాలు రక్తంలో గ్లూకోజ్‌ లెవెల్స్‌ మార్పులను గుర్తిస్తాయి. అవసరమైన సమయంలో ఇన్సూలిన్‌ను అవే విడుదల చేస్తాయి. లాబొరేటరీల్లో పెంచిన కణ సమూహాలను రోగి శరీరంలో పొత్తికడుపు కింది భాగంలో ప్రవేశపెట్టారు. అవి పేషెంట్‌ రక్త సరఫరాలో కలిసిపోయి.. పనిచేయడం ప్రారంభించాయి.

పెద్ద సవాలు కూడా ఉంది…

ప్రవేశపెట్టిన కణాలను శరీరం అంగీకరిస్తుందా.. లేదా? అన్నదే ప్రధాన సవాలుగా ఉంది. ఎందుకంటే.. ఈ అంశమే చికిత్స ఫలితాన్ని నిర్ణయిస్తుంది. రోగి శరీరంలో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టిన కొత్తగా అభివృద్ధి చేసిన కణాలు.. సహజ బీటా కణాల్లా పనిచేశాయి. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరిగినప్పుడు అవి ఇన్సూలిన్‌ విడుదల చేశాయి. దాంతో రోగి బయటి నుంచి ఇచ్చే ఇన్సూలిన్‌పై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గిపోయింది. చికిత్స అనంతరం డాక్టర్లు రోగిని నిత్య పర్యవేక్షణలో ఉంచారు. కణాల స్థితి, ఇమ్యూన్‌ ప్రతిచర్యలు, ఇతర సమస్యలేమైనా వస్తున్నాయా? అనేది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

దీర్ఘకాలిక పరిష్కారం?

స్టెమ్‌సెల్‌ ఆధారిత ఈ చికిత్సా విధానం.. పునరుత్పత్తి వైద్యం (Regenerative Medicine)లో కీలక ముందడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో రోగుల వ్యక్తిగత అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుంది. దీనిని టైప్‌–2 డయాబెటిస్‌కు దీర్ఘకాలిక పరిష్కారంగా భావిస్తున్నారు. అయితే.. ఈ విధానం విస్తృత స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికంంత కాలం పట్టే అవకాశం ఉంది. దీనిపై క్లినికల్‌ పరిశోధనలు, దీర్ఘకాలిక ఫలితాల విశ్లేషణ చేయాల్సి ఉంది. టైప్‌–2 డయాబెటిస్‌ పూర్తిగా నయమైందని చెప్పడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ.. చైనాలో చేసిన ఈ ప్రయోగం.. వైద్య చరిత్రలో కీలక మలుపుగా నిలిచిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్టు సాగితే.. ఇది మధుమేహానికి చికిత్సలో గేమ్‌ చేంజర్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Pakistan vs Afghanistan : అఫ్టానిస్తాన్ పై యుద్దం ప్రకటించిన పాక్… సూసైడ్‌ స్క్వాడ్‌ తో అప్ఘాన్?
Worlds Tallest Bridge | ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నుంచి జాలువారుతున్న జ‌ల‌పాతం.. ఆక‌ట్టుకుంట‌న్న వీడియో