Vivo S60 | చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 29వ తేదీన చైనాలో Vivo S60 మొబైల్‌ను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. లాంచ్ డేట్‌తో పాటు కొత్త ఫోన్ డిజైన్, కీలక ఫీచర్లను బయటపెట్టింది. ఇందులో 7200mAh భారీ బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ మొబైల్ వస్తుండటంతో టెక్ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.
చైనాకు చెందిన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ వైబోలో చేసిన పోస్టు ప్రకారం Vivo S60 స్మార్ట్‌ఫోన్‌ను మే 29వ తేదీ రాత్రి 7.30 గంటలకు (భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5 గంటలకు ) చైనాలో ఆవిష్కరించనుంది. భారత్‌లో దీని విడుదలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వివో కంపెనీ చేయలేదు. సాధారణంగా చైనాలో విడుదలైన S సిరీస్ మొబైళ్లను V సిరీస్‌గా రీబ్రాండ్ చేసి వివో కంపెనీ భారత మార్కెట్‌లో విడుదల చేస్తూ ఉంది. ఈ క్రమంలో వివో S60 మోడల్ అదే పేరుతో కాకుండా భారత్‌లో V సిరీస్ మోడల్‌గా వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల అంచనా వేస్తున్నాయి. Vivo V80గా ఈ మొబైల్ భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
కంపెనీ విడుదల చేసిన టీజర్ ప్రకారం.. ఈ ఫోన్ వెనుక భాగంలో రెక్టాంగిల్ ఆకారంలో కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.ఫోన్ వెనుక భాగం ఫ్లాట్ డిజైన్‌లో ఉండగా.. దిగువ భాగంలో వివో బ్రాండింగ్‌ను ఇచ్చారు. వైట్ కలర్ వేరియంట్‌లో ఈ ఫోన్‌ను టీజ్ చేశారు. దీని వెనుక భాగంలో బ్లూ షేడ్స్ కూడా ఉన్నాయి. Unibody Cold Curved Glass డిజైన్‌ను ఈ ఫోన్‌లో వినియోగించినట్లుగా వివో కంపెనీ వెల్లడించింది. ఈ మొబైల్‌కు కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి.
ఈ వివో S60 స్మార్ట్‌ఫోన్‌లో 7200mAh సామర్థ్యంగల బ్లూ ఓషన్ బ్యాటరీని అందిస్తున్నట్లు వివో కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్ హాన్ బోషియావో తెలిపారు. గత ఏడాది విడుదలైన Vivo S50 మొబైల్‌లో ఉన్న 6500mAh బ్యాటరీ కంటే అధికం కావడం గమనార్హం. USB Type-C ద్వారా 90W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్టు చేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో గ్లోబల్ డైరెక్ట్ డ్రైవ్ పవర్ సప్లై 2.0 టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీని ద్వారా చార్జింగ్ సమయంలో వేడి నియంత్రణ మెరుగ్గగా ఉంటుందని పేర్కొంది.
అదనంగా ఈ మొబైల్‌లో మైక్రో ఎలక్ట్రిక్ విజార్డ్ 2.0 ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా మొబైల్ బ్యాటరీ పూర్తిగా అయిపోయి స్విచ్ఛాఫ్ అయ్యే సందర్భాల్లో యూజర్ వర్క్ ఆటోమేటిగ్గా సేవ్ అవుతుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో IP68, IP69 రేటింగ్ ఉండటంతో నీరు, ధూళి నుంచి మెరుగైన రక్షణ లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ స్పీకర్లు, ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్ లీనియర్ వైబ్రేషన్ మోటార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సెక్యూరిటీ కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందిస్తున్నారు.
Read More:
భారత్‌లోకి వచ్చేసిన మోటరోలా తొలి బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరాతో లాంచ్!
భారీ బ్యాటరీతో మోటరోలా నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. మే19న లాంచ్!
