Motorola Razr Fold | భారత్‌లోకి మరో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. ప్రముఖ టెక్ సంస్థ మోటరోలా తన తొలి బుక్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Motorola Razr Foldను అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం డిజైన్, భారీ బ్యాటరీ, అత్యాధునిక ఫీచర్లతో వచ్చి ఈ ఫోన్‌ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది.

ధర ఎంతంటే..

Razr Fold ప్రారంభ ధరను మోటరోలా రూ.1,49,999గా నిర్ణయించింది. ఇది 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్‌గా ఉంది. ఇక 16జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.1,59,999గా ఖరారు చేసింది. ఈ రెండు వేరియంట్లతో పాటు అదనంగా FIFA World Cup 2026 స్పెషల్ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది. ఈ ప్రత్యేక వేరియంట్ ధరను రూ.1,69,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ Pantone Blackened Blue, Pantone Lily White రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ మొబైల్ కొనుగోలు చేయవచ్చు.

ఆఫర్లు

ఈ ఫోల్డబుల్ ఫోన్ కొనుగోలుపై కంపెనీ పలు ఆఫర్లను కూడా ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై కొనుగోలు సమయంలో రూ.10 వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. లేదంటే అదే మొత్తానికి ఎక్స్చేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఎంపిక చేసిన కార్డులపై 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఇక జూన్ 20వ తేదీలోపు ఫోన్ కొనుగోలు చేసిన వారికి ఏడాదిపాటు స్క్రీన్ రీప్లేస్‌మెంట్ (ఒక్కసారి మాత్రమే) సదుపాయం కల్పిస్తున్నట్లు మోటరోలా కంపెనీ వెల్లడించింది.

డిస్‌ప్లే ఫీచర్లు

Razr Foldలో రెండు పెద్ద డిస్‌ప్లేలు ఉన్నాయి. బయట భాగంలో 6.6 అంగుళాల LTPO pOLED కవర్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 165Hz రీఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు లోపలి భాగంలో 8.1 అంగుళాల భారీ LTPO pOLED ఇన్నర్ డిస్‌ప్లే కనిపిస్తుంది. ఇది 2K రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 6200 నిట్స్‌పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్టు చేస్తుంది. అలాగే అల్ట్రా థిన్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది.

ప్రాసెసర్ వివరాలు!

ఈ స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి Adreno A829 GPU కూడా జత చేశారు. ఈ ఫోన్‌లో గరిష్టంగా 16GB LPDDR5X ర్యామ్, 512జీబీ UFS 4.1 స్టోరేజ్ ఇచ్చారు. అధిక గ్రాఫిక్స్ గేమింగ్, మల్టీటాస్కింగ్, ఏఐ ఫీచర్లను సాఫీగా నిర్వహించే సామర్థ్యం ఈ చిప్‌సెట్‌కు ఉందని మోటరోలా కంపెనీ తెలిపింది.

ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత My UX ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీనికి ఏడు సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని మోటరోలా కంపెనీ వెల్లడించింది.

కెమెరా స్పెసిఫికేషన్లు

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ప్రత్యేకంగా ఈ రేజర్ ఫోల్డ్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50మెగాపిక్సెల్ సోనీ LYTIA ప్రధాన కెమెరా, 3X ఆప్టికల్ జూమ్‌తో 50మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా, 50మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. వీటితో 8K వీడియోలను 30fps వద్ద, 4K వీడియోలను 60fps వద్ద రికార్డు చేయొచ్చని కంపెనీ తెలిపింది. అదనంగా కవర్ స్క్రీన్‌పై 32మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ఇన్నర్ డిస్‌ప్లేలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

6000mAh భారీ బ్యాటరీ

ఈ మొబైల్‌లో 6000mAh సామర్థ్యం కలిగిన సిలికాన్ కార్బన్ బ్యాటరీని అందించారు. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌లో 5జీ, వైఫై 7, NFC, GPS, NavIC, USB Type C వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి IP49 రేటింగ్‌తో వస్తుండటంతో కొంతమేరకే ధూళి, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. ఇక ఈ ఫోన్ బరువు 243 గ్రాములు.

Read More:

200MP కెమెరా, 10X ఆప్టికల్ జూమ్‌తో ఒప్పో నుంచి ఫ్లాగ్‌షిప్ మొబైల్.. లాంచ్ ఎప్పుడంటే..!

8000mAh టైటాన్ బ్యాటరీతో Realme 16T 5G.. లాంచ్ ఎప్పుడంటే..!