England vs Australia : యాషెస్..మూడో టెస్టులో ఓటమి దిశగా ఇంగ్లాండ్

అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 207 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువయ్యింది.

England vs Australia : యాషెస్..మూడో టెస్టులో ఓటమి దిశగా ఇంగ్లాండ్

విధాత : యాషెస్‌ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా అస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి దిశగా సాగుతుంది. 435 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు వరుసగా ఔటవ్వడంతో ఆ జట్టు ఓటమి అంచులో పడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ 63 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఇంకా 228 రన్స్‌ వెనుకంజలో ఉంది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభమైన కాసేపటికే 4 పరుగుల వద్ద ఓపెనర్ బెన్ డకెట్(4) వికెట్ తన తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా ఇంగ్లాండ్ వికెట్లు కోల్పోయింది.

ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో జాక్‌ క్రాలీ (85; 151 బంతుల్లో, 8 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. జోరూట్‌ (39), హ్యారీ బ్రూక్‌(30), ఓలీ పోప్‌ (17), బెన్‌స్టోక్స్‌ (5) బ్యాటింగ్‌లో విఫలయ్యారు. ఆట ముగిసే సమయానికి.. జెమ్మీ స్మిత్‌ 2* (30 బంతుల్లో ), విల్‌ జాక్స్‌ 11* (31 బంతుల్లో, 2 ఫోర్లు ) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్‌, నాథన్‌ లైయన్‌ చెరో మూడు వికెట్లు సాధించి ఇంగ్లాండ్ ను దెబ్బతీశారు.

అంతకుముందు 271/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ 349 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ట్రావిస్ హెడ్‌ 170 (219 బంతుల్లో, 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), వికెట్ కీపర్ అలెక్స్ కేరీ 72 పరుగులు (128 బంతుల్లో, 6 ఫోర్లు) చేశారు. జోష్‌ ఇంగ్లిస్‌ (10), పాట్‌ కమిన్స్‌ (6), నాథన్‌ లైయన్‌ (0), స్కాట్‌ బోల్యాండ్ (1) స్వల్ప పరుగులకే వెనుదిరిగారు. మిచెల్ స్టార్క్‌ (7*) నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్‌టంగ్‌ 4, బ్రైడన్ కార్స్‌ 3, జోఫ్రా ఆర్చర్‌, విల్‌జాక్స్‌, బెన్‌స్టోక్స్‌ తలో వికెట్‌ తీశారు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ లో ఇప్పటికే అస్ట్రేలియా తొలి రెండు టెస్టులను గెలిచి 2-0 ఆధిక్యతలో ఉంది.

ఇవి కూడా చదవండి :

Actress Aamani : బీజేపీలో చేరిన నటి ఆమని
India T20 World Cup squad| టీ 20 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటన..గిల్ ఔట్