Telangana Politics | వన జాతర నుంచి ఎన్నికల జాతరలోకి.. అంతా పరకాయ ప్రవేశం
ప్రఖ్యాత మేడారం జాతర ముగిసిందో, లేదో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులతో సహా అంతా మరో జాతరలోకి జనాన్ని కూడా లాగేశారు. పరకాయప్రవేశం చేసినట్లుగా అంతా మారిపోయి మరో పాత్ర నిర్వహించే పనుల్లో నిమగ్నమయ్యారు.
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Telangana Politics | ప్రఖ్యాత మేడారం జాతర ముగిసిందో, లేదో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులతో సహా అంతా మరో జాతరలోకి జనాన్ని కూడా లాగేశారు. పరకాయప్రవేశం చేసినట్లుగా అంతా మారిపోయి మరో పాత్ర నిర్వహించే పనుల్లో నిమగ్నమయ్యారు. నెల రోజుల నుంచి ముఖ్యంగా గత నెల 28 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు మేడారం జాతర హడావుడిలో తమదైన బాధ్యతలు, పాత్రలు నిర్వహించిన వారంతా ఒక్కొక్కరుగా మరో పాత్రలోకి మారిపోయారు. జాతర సందడి ముగియగానే అంతా మున్సిపల్ ఎన్నికల రాజకీయ కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతున్నారు. జాతర వాతావరణం నెమ్మదిగా చల్లబడి ఎన్నికల రాజకీయ వాతావరణం ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది.
పాత్ర మార్చిన అధికార పక్ష నేతలు
ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన రాజకీయ నేతలు మున్సిపల్ ఎన్నికల వ్యవహారాల్లో ఇప్పుడిప్పుడే తలమునకలవుతున్నారు. జాతర నుంచి శనివారం సాయంత్రం వచ్చిన అధికారులు, సిబ్బంది ఆదివారం కాస్తంత విశ్రాంతి తీసుకుని తిరిగి తమ విధుల్లో భాగస్వామ్యమయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఈ పాత్రను అప్పుడే నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకు మేడారం జాతర నిర్వహణలో పాల్గొన్న మంత్రులు సీతక్క, పొంగులేటి, కొండా సురేఖ, అడ్లూరి తదితరులు తాజాగా మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ బాధ్యతలను నెరవేర్చేందుకు సమాయత్తమవుతున్నారు. వరంగల్ లోక్ సభ ఇంచార్జ్ గా ఉన్న పొంగులేటి ఇప్పటికే తొర్రూరు, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలంటూ ప్రచారాన్ని కొనసాగించారు. దీంతో పాటు తన స్వంత నియోజకవర్గమైన పాలేరు పరిధిలోని ఎదులాపురం మున్సిపల్ ఎన్నికల వ్యూహంలో భాగస్వామ్యమయ్యారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ మేడారం కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ చివరి రోజు మేడారానికి వచ్చి ఆ తర్వాత ఖమ్మం లోక్ సభ ఇంచార్జ్ బాధ్యతల్లో పాల్గొన్నారు.
భువనగిరి లోక్ సభ నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క జాతర పనులు సాగుతున్న సమయంలోనే ఒక పర్యాయం ఆ నియోజకవర్గంలోని భువనగిరి, ఆలేరు, జనగామ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నారు. తాజాగా మేడారం బాధ్యతలు పూర్తయినందున ఇక ఆ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల విజయానికి కృషి చేసేందుకు సమాయత్తమవుతున్నారు. దీంతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు పథకాలు రచించే పనిలో ఉన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం, నర్సంపేట, ములుగు మున్సిపాలిటీల్లో సుడిగాలి పర్యటన చేశారు. దీంతో పాటు తన నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అడ్లూరి లక్ష్మణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురితో పాటు మంత్రిగా జగిత్యాల తదితర మున్సిపాలిటీ ఎన్నికల వ్యవహారాల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లా పై మేడారం జాతర ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు అంతర్గత కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైన ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల నాయకులు సైతం జాతర ముగియడంతో తమ ఎన్నికల కార్యచరణకు పదునుపెడుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగియగానే ప్రచారపర్వాన్ని ఉరకలెత్తించేందుకు రాజకీయ పక్షాలు అన్ని రకాల సరంజామాను సిద్ధం చేసుకుంటున్నాయి.
ఉద్యోగులు ఎన్నికల విధుల్లో
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల పరిధిలోని ఉద్యోగులు ఎన్నికల విధుల్లో మునిగిపోయారు. డోర్నకల్, మరిపెడ, మహబూబాద్, కేసముద్రం, తొర్రూరు, నర్సంపేట, ములుగు, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘన్ పూర్, జనగామ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నమొన్నటి వరకు మేడారం జాతర పనుల్లో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తిరిగి తమ రోజువారీ విధుల్లో పాల్గొంటుండగా ఎన్నికలు జరిగే మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే వివిధ శాఖల ఉద్యోగులు మాత్రం ఎన్నికల విధుల నిర్వహణలో భాగస్వామ్యమవుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో మేడారం విధుల్లో పాల్గొన్నారు. వారంతా తిరిగి తమతమ శాఖల్లో, సాధారణ విధుల్లో లీనపోయారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram