Site icon vidhaatha

SRH vs PBKS : పంజాబ్ మ్యాచ్ లో హైదరాబాద్ విజయం

ఐపీఎల్‌-2024లో పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్​ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో పంజాబ్​ 6 వికెట్ల నష్టానికి 180  పరుగులు చేసింది. అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్​కు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి.  39 పరుగులకే మూడు అత్యంత కీలక వికెట్లు ( అభిషేక్​ ‌‌– 11 బంతుల్లో 16), ట్రావిస్​ హెడ్​(15 బంతుల్లో 21), మార్క్​రమ్​(2 బంతుల్లో 0) కోల్పోయిన హైదరాబాద్​ను తెలుగు కుర్రాడు, ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్​ కుమార్‌ రెడ్డి ఆదుకున్నాడు.

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన నితీశ్​ తన అద్భుత ప్రదర్శనతో అందరని ఆకట్టుకున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన నితీశ్​ మిడిల్‌ ఓవర్లలో పంజాబ్​ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ నితీశ్  మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా 15 వ ఓవర్‌ వేసిన పంజాబ్‌ స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌ను నితీష్‌ ఊచకోత కోశాడు. ఆ ఓవర్‌లో ఏకంగా రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న నితీష్‌.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు.  ఇక నితీష్‌ ఊచకోత మూలంగా సన్​రైజర్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్​ను హైదరాబాద్​ బౌలర్లు బాగా కట్టడి చేసి టపటపా వికెట్లు నేలకూల్చారు.

వారి ధాటికి పవర్​ప్లే ముగిసేసరికి పంజాబ్​ 27 పరుగుల అత్యల్పస్కోరుకే మూడు వికెట్లు కోల్పోయింది. జానీ బెయిర్​స్టో డకౌట్​ కాగా, ప్రభ్​సిమ్రన్ సింగ్ (4), కెప్టెన్​ శిఖర్​ ధవన్​(14) చేసారు. తర్వాత వచ్చిన సామ్​ కరన్​ కొద్దిసేపు ఎదురుదాడి చేసినా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. తర్వాత వచ్చిన సికందర్​ రజా, శశాంక్​సింగ్​ కొద్దిసేపు నిలకడగా ఆడారు. రజా అవుటయిన తర్వాత రెచ్చిపోయిన శశాంక్​, అశుతోష్​ శర్మ తోడుగా దాదాపుగా గెలిపించినంత పని చేసాడు. ఆఖరి ఓవర్​లో పంజాబ్​కు 29 పరుగులు అవసరం కాగా 26 పరుగులు చేయగలిగింది.

Exit mobile version