‘Adani’ connection । మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టులో ‘అదానీ’ కనెక్షన్‌?

లక్షన్నర కోట్లతో మూసీ పునర్జీవం లేదా పునరుద్ధరణ ప్రాజెక్టు ఉద్దేశాలేంటన్న (intentions) చర్చ నడుస్తున్నది. ఉన్న దానిని మరింత నాశనం చేసి, కొత్త కాలుష్యాలు పారేందుకు చేపట్టారా? అనే అనుమానాలను పలువురు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. రామన్నపేట వద్ద అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ (Ambuja Cement Factory) కోసమే మూసీ ప్రాజెక్టును చేపట్టారా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

‘Adani’ connection । మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టులో ‘అదానీ’ కనెక్షన్‌?

‘Adani’ connection । హైదరాబాద్‌ నగరంలో (Hyderabad city) పరిష్కరించాల్సిన అనేక సమస్యలు ఉన్నాయి. అడ్డగోలు అనుమతులతో ఇప్పటికే అతి త్వరలో హైదరాబాద్‌ నగరం నివాసయోగ్యంగా ఉండే (will not be habitable) అవకాశాలు లేవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ఒక కీలక నగరంగా ఉన్న హైదరాబాద్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ట్రాఫిక్‌ (Traffic) వంటి కీలక అంశాలు ఉన్నాయి. ట్రాఫిక్‌ రద్దీ (traffic congestion) కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. గుంపులు గుంపులుగా ఎక్కడపడితే అక్కడ ఆగిపోయే ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాల నుంచి పుట్టే పొగ భూతాలు సృష్టిస్తున్న వినాశనాన్ని అంచనా వేస్తే గుండెలు అదరక మానవు. దీనితో పోల్చితే మూసీ కాలుష్యం (pollution of Musi) లెక్కలోకి కూడా రాదనే అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఇంత సడన్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మూసీ ప్రక్షాళనపై (Moose purge) ఎందుకంత మమకారం పుట్టుకొచ్చిందనే విషయంలో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మూసీని కాలుష్యం బారి నుంచి రక్షించాల్సిందే. కానీ.. దీని వెనుక వేరే ఉద్దేశాలు ఉంటే మాత్రం రేవంత్‌రెడ్డి  చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

కృష్ణా, గోదావరి, గంగ, యమున పేర్ల మీద ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నామని, కానీ ఏ తండ్రయినా తన బిడ్డకు మూసీ అని పేరు పెట్టుకున్నాడా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy).. 2024, అక్టోబర్‌ 6వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక(Shilpakavedika)లో ‘కొలువుల పండుగ’ పేరుతో నిర్వహించిన సభలో ఆవేదన వ్యక్తం చేశారు. మూసీని అద్భుతంగా తీర్చిదిద్దినప్పుడు కచ్చితంగా తల్లిదండ్రులు తమ బిడ్డలకు మూసీ అనే పేరు పెట్టుకుంటారని విశ్వాసం కూడా వ్యక్తం చేశారు. అయితే.. మూసీ ప్రక్షాళన అంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోవైపు అదే మూసీని మరింత కాలుష్యకారకంగా తయారు చేసేందుకు అవకాశం ఇస్తుండటం అనుమానాలు (suspicions) రేకెత్తిస్తున్నది. ఇప్పటికే ప్రతిపక్ష బీఆరెస్‌ నేతలు ముఖ్యమంత్రిని మూసీ విషయంలో టార్గెట్‌ చేస్తున్నారు. అయితే.. తాజాగా మూసీ ప్రక్షాళనలో అదానీ లింకులు ఉన్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో (ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా)ని రామన్నపేట సమీపంలోని కొమ్మాయిగూడ(Kommaiguda)లో ఒక భారీ సిమెంట్‌ ఫ్యాక్టరీ (cement factory) కోసం 360 ఎకరాల భూమిని సేకరించి పెట్టారని తెలుస్తున్నది. ఇందులో 70 ఎకరాల్లో అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ(Ambuja Cement Factory)ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. అంబుజా సిమెంట్స్‌ ఎవరిదో కాదు.. ప్రధాని మోదీకి సన్నిహిత వ్యాపార/పారిశ్రామికవేత్తగా చెప్పే అదానీకి సంబంధించినది. రామన్నపేట ఉన్నది మూసీ పక్కనే. ఈ నేపథ్యంలో అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ కోసమే మూసీ ప్రక్షాళన చేపట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిమెంట్‌ ఫ్యాక్టరీకోసం శుద్ధ జలాలు అవసరం ఉంటాయి. ఇప్పుడు మూసీ ఉన్న పరిస్థితిలో ఆ నీటిని సిమెంట్‌ ఫ్యాక్టరీ కోసం ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీకి శుద్ధ జలాలు అందించే క్రమంలో మూసీ సుందరీకరణ(beautification), పునరుద్ధరణ (restoration) అనే అంశాలను జోడించారా? అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు పారుతున్న మూసీనదిని లైవ్‌గా మార్చడం అంటే.. పై నుంచి నిరంతరం నీరు వచ్చే ఏర్పాటు చేయడమే. అదే నీటిని సిమెంట్‌ ఫ్యాక్టరీ ఉపయోగించుకుంటుందన్నమాట.

వాస్తవానికి గతంలో ఇక్కడ ఈ 360 ఎకరాల భూమిని డ్రైపోర్ట్‌ కోసం సేకరించారు. కానీ.. ఇదే భూమిలో అంబూజా కంపెనీ సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నది. రామన్నపేట వద్ద 70 ఎకరాల్లో 14 వందల కోట్లతో సిమెంట్‌ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు అనుమతులు కోరింది. ఇప్పటికే కాలుష్యభరిత మూసీతో రామన్నపేట వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇదే ప్రాంతంలో సిమెంట్‌ ఫ్యాక్టరీ రావడం అంటే.. మూసీని మరింత కలుషితం చేయడమే కాకుండా.. స్థానికుల ఆరోగ్యంపైనా తీవ్ర దుష్ప్రభావాలు చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి డ్రైపోర్టు (dryport) కోసం సేకరించిన భూమిలో సిమెంట్‌ ఫ్యాక్టరీని కడతారన్న విషయం బయటకు రావడంతో స్థానికులు ఆందోళనకు కూడా దిగారు. సిమెంట్‌ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో దాదాపు 14 కిలోమీటర్ల పరిధిలో ప్రజలను ప్రభావితం చేస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని సాగు భూములన్నీ ఎందుకూ పనికిరాకుండా (useless) పోతాయని రైతు సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాంటుకు అనుమతి ఇవ్వడం అంటే మూసీని మరింత కాలుష్యకారకంగా మార్చివేయడమేనని పలువురు పర్యావరణ వేత్తలు సైతం చెబుతున్నారు.

ఇప్పటికే మూసీ పుట్టిన ప్రాంతమైన వికారాబాద్‌ అడవుల్లోని దామగుండం (Damagundam) ప్రాంతాన్ని ఎన్ని విమర్శలు వ్యక్తమవుతున్నా, తీవ్ర నిరసనలు వచ్చినా వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ కేంద్రం (VLF radar center) ఏర్పాటుకు గాను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అప్పగించింది. ఇక్కడ అటవీ విధ్వంసం ఉండబోదని ముఖ్యమంత్రి చెబుతున్నా.. దాదాపు 12 లక్షల చెట్లు నరికివేస్తారని ప్రచారం జరుగుతున్నది. అది మూసీని నేరుగా ప్రభావితం చేస్తుందనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లక్షన్నర కోట్లతో మూసీ పునర్జీవం లేదా పునరుద్ధరణ ప్రాజెక్టు ఉద్దేశాలేంటన్న (intentions) చర్చ నడుస్తున్నది. ఉన్న దానిని మరింత నాశనం చేసి, కొత్త కాలుష్యాలు పారేందుకు చేపట్టారా? అనే అనుమానాలను పలువురు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. రామన్నపేట వద్ద అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ (Ambuja Cement Factory) కోసమే మూసీ ప్రాజెక్టును చేపట్టారా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రత్యేకించి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు అనుమానాలను నివృత్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

కొసమెరుపు :
మూసీ పేరు ఎవరూ పెట్టుకోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్న మాట విని.. పలువురు తెలంగాణ ఉద్యమకారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మూసీ పేరు తెలంగాణ జనజీవితంతో పెనవేసుకుని ఉన్నది. రేవంత్‌రెడ్డికి చరిత్ర తెలియదని తెలంగాణ సీనియర్‌ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఒక ఇంటర్వ్యూలో విమర్శించారు. ఉద్యమకారుడు పిట్టల శ్రీశైలం తన కుమార్తెకు ముచ్కుంద (మూసీ) అని పేరు పెట్టారని, తన టెలివిజన్‌కు మూసీ టీవీ అని నామకరణం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రముఖ రచయిత బీఎస్‌ శాస్త్రి తన ముద్రణాసంస్థకు మూసీ పబ్లికేషన్స్‌ అనే పేరు పెట్టిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి మూసీ ఇంత కాలుష్యభరితంగా మారడానికి గత కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలే కారణమనే విమర్శలు బలంగా ఉన్నాయి.