Adilabad SP Akhil Mahajan Promises Library For Tribal Youth, Urges Students To Focus On Education
విధాత, ఆదిలాబాద్ | మే 23, 2026: మారుమూల గిరిజన ప్రాంతాల్లో యువత విద్య, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టేలా పోలీస్ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం గాదిగూడ మండలంలోని మారేగావ్, హీరాపూర్, పరస్వాడ-బి, గౌరి, కొలాంగూడ గ్రామాల్లో పర్యటించారు. గిరిజనులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పిల్లల చదువు, యువత భవిష్యత్తు, స్వయం ఉపాధి, రోడ్డు భద్రత వంటి అంశాలపై సూచనలు చేశారు.
గిరిజన గ్రామాల్లో ఎస్పీ పర్యటన
తొలిసారిగా తమ గ్రామాలకు వచ్చిన ఎస్పీకి గిరిజనులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులతో కలిసి అల్పాహారం చేసిన అఖిల్ మహాజన్.. స్థానిక పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలను చదివించాలని, ముఖ్యంగా బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. చిన్న వయసులో పెళ్లిళ్లకు దూరంగా ఉండాలని, యువత భవిష్యత్తును దెబ్బతీసే అలవాట్లకు లోనుకావద్దని చెప్పారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వర్షపు నీటిని సంరక్షించాల్సిన అవసరాన్ని కూడా ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను ఉపయోగించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు.
త్వరలో లైబ్రరీ.. ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణ
గిరిజన యువత విద్య, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలని సూచించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
గిరిజన యువత కోసం గాదిగూడలో త్వరలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హామీ ఇచ్చారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఇది ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారత సైన్యంలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని కూడా చెప్పారు.
గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన గిరిజనులకు సూచించారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అర్హత కలిగిన వైద్యులను సంప్రదించాలని, దొంగ డాక్టర్లపై ఆధారపడవద్దని హెచ్చరించారు. యువతను క్రీడలవైపు ప్రోత్సహించేందుకు గ్రామాల యువకులకు వాలీబాల్ కిట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, నార్నూర్ సీఐ అంజమ్మ, గాదిగూడ ఎస్ఐ రమ్యతో పాటు ఆయా గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.
