విధాత, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రేపు బుధవారం హైకోర్టులో కీలక విచారణ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తాజాగా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఆది శ్రీనివాస్ రాష్ట్ర మున్నూరు కాపు ఆపెక్స్ కమిటీ చైర్మన్ హోదాలో కూడా ఉన్నారు. ఆది శ్రీనివాస్ తో పాటు ఇప్పటిదాక బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వివాదంపై ఆర్. కృష్ణయ్య స్పందిస్తూ 56 శాతం జనాభా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తే అగ్రకులాలకు మండిపోతుందని విమర్శించారు. బీసీల ఎదుగుదలను అగ్ర కులాలు ఓర్వలేక పోతున్నాయని, హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం అన్నారు. ఇప్పటి వరకు బీసీల్లో ముఖ్యమంత్రి లేరని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.