Harish Rao | బోనస్ చెల్లింపుపై ప్రభుత్వాన్ని వదలిపెట్టం: హరీశ్‌రావు

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కోన్న రీతిలో, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా దొడ్డు వడ్లకు, సన్నలకు క్వింటాల్‌కు 500బోనస్ ఇవ్వాల్సిందేనని, ఇచ్చేదాకా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హరీశ్‌రావు హెచ్చరించారు.

  • Publish Date - May 21, 2024 / 06:30 PM IST

హామీ మేరకు దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే

విధాత, హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కోన్న రీతిలో, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా దొడ్డు వడ్లకు, సన్నలకు క్వింటాల్‌కు 500బోనస్ ఇవ్వాల్సిందేనని, ఇచ్చేదాకా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు హెచ్చరించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం దొడ్డు వడ్లకు రూ.500 బోనస్‌ లేదనడం దారుణమన్నారు. హామీ ప్రకారం మిగతా పంటలకు కూడా బోనస్‌ ఇవ్వాలని కోరారు.

యాసంగిలో 90శాతం రైతులు దొడ్డు వడ్లను పండిస్తారన్నారు. సన్న వడ్లకు బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నదని.. సన్న వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్‌ ఇవ్వాల్సిన పరిస్థితే రాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1.20కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పడుతుందని.. అన్నింటికి బోనస్‌ ఇవ్వాలంటే రూ.6వేలకోట్ల భారం పడుతుందని.. అందుకే సన్న వడ్లను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. సన్న వడ్లతో రూ.400 కోట్ల మాత్రమే ఖర్చవుతుందన్నారు.

యాసంగిలో రైతులు సన్న వడ్లు పండించరని.. పండించని వడ్లకు బోనస్ ఎలా ఇస్తారని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌, భట్టి, ప్రియాంక, రాహుల్‌గాంధీలు అంతా వడ్లకు 500బోనస్ ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు బోనస్‌ ఇవ్వకుండా ఎగవేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రకు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డు వడ్లకు అసలు బోనస్ ఇస్తారా ఇవ్వరా కాంగ్రెస్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద ఎకరాకు ప్రభుత్వం రూ.2500 ఇవ్వాల్సి ఉందని.. వానాకాలానికి సంబంధించి ఎకరానికి రూ.15 వేల రైతుబంధు యాసంగి బకాయిలు సైతం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దొడ్డు వడ్ల కొనుగోలులోనూ జాప్యమే

వడ్ల కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వం వడ్లు కొనకపోవడంతో రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలం సమీపించినా యాసంగి ధాన్యం కొనుగోలు పూర్తి కాలేదని, రోజుల తరబడి రైతులు ఎండకు, వానకు కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్నారన్నారు. దొడ్డు వడ్లు కొనుగోలు చేస్తారా? లేదా? అంటూ ప్రశ్నించారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఇక రైతుబంధు డబ్బులను జూన్‌ నెలలోనే వేయాలని.. రైస్‌మిల్లర్ల నుంచి కొనుగోలు చేసైనా సన్నబియ్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తడిసిన ధాన్యాన్ని మొలకలు రాక ముందే కొనుగోలు చేయాలని.. కొనుగోలు కేంద్రాల్లో లారీల నుంచి ధాన్యం దించే పరిస్థితి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీసం సబ్సిడీ పై జీలుగ విత్తనాలు సైతం సక్రమంగా అందించడం లేదన్నారు.

Latest News