విధాత, హైదరాబాద్ : వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో తెలంగాణ విద్యార్థులకు నష్టం చేసేదిగా ఉందని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టి.హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేష్ మండిపడ్డారు. బుధవారం బంజారాహిల్స్ తెలంగాణ భవన్ లో హరీశ్ రావు సహచర ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయం మూలంగా తెలంగాణలో స్వరాష్ట్ర విద్యార్థులు స్థానికేతరులుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం రాకముందు స్థానికులకు 60, 70 శాతం ఉద్యోగాలు, 40,30 శాతం రిజర్వేషన్లు ఉండేవన్నారు. తమ ప్రభుత్వం రాగానే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు అమలు చేశామన్నారు.
అడ్మిషన్లలో సొంత రూల్స్ రూపొందించుకునే మంచి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా పాత పద్ధతి కొనసాగిస్తూ జిఓ 30 తెచ్చారన్నారు. తమిళనాడు, కర్ణాటక తో పాటు మిగతా రాష్ట్రాల్లో ఉన్న స్థానికత విధానాలు ఇక్కడ అమలు చేస్తే సరిపోయేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయినా స్థానికత పై సరైన విధానం రూపొందించక పోవడం దురదృష్టకరమని విమర్శించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా పదేళ్ల పాటు ఉన్నందువల్ల పార్లమెంటు చట్టం ప్రకారం మేము పాత పద్ధతి కొనసాగించామన్నారు. పదేళ్ల కాలం ముగిసినా కాంగ్రెస్ ప్రభుత్వం పాత పద్ధతినే కొనసాగించడం ఏమిటీ అని ప్రశ్నించారు. ఆగస్టు 9 నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం మంచిదే అయినా డబ్బులు విడుదల చేయనిది ఏం లాభమన్నారు. నిధులు విడుదల చేసి విధుల గురించి మాట్లాడాలని హరీశ్ రావు కోరారు.