Site icon vidhaatha

Harish Rao | రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా?: హరీశ్‌రావు ఫైర్

Harish Rao | రుణమాఫీ (Runa Mafi) కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా? ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అనుసరించడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆరెస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ట్విటర్ వేదిగా మండిపడ్డారు. రుణమాఫీ కాలేదని అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియచేస్తున్న రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య అని, పోలీసు యాక్ట్ (30) పేరు చెప్పి, జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు హుకుం జారీ చేయడం హక్కులను కాలరాయడమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారని, అరెస్టులు చేస్తున్నారని, ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని బీఆరెస్ పార్టీ (BRS Party) పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రైతులు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోతున్నారని, ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నదన్నారు. ప్రభుత్వం రైతుల రుణమాఫీ (Runa Mafi)  సమస్యకు పరిష్కారం చూపకుండా, పోలీసులను పురమాయించి గొంతెత్తిన వారిని బెదిరించడం, అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఒకవైపు రైతు బంధు రాక, మరోవైపు రుణమాఫీ కాక అన్నదాత ఆవేదనలో ఉన్నడని, వ్యవసాయ పనులు చేసుకోవాలా లేక రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారని హరీశ్‌రావు తెలిపారు.

ఏకకాలంలో ఆగస్టు 15లోపు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆచరణలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని, నమ్మి ఓటేసినందుకు రైతన్నను నట్టేట ముంచారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారిందని, ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మరిచిపోయినట్లున్నారన్నారు. ఇప్పటికైనా కండ్లుతెరిచి రైతులందరికీ రుణమాఫీ చేయాలని, ఆందోళనలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నామన్నారు. అదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే అరెస్టు చేసిన రైతన్నలకు అండగా బీఆరెస్‌ పార్టీ కార్యచరణ ప్రకటిస్తుందని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Exit mobile version