MLC Ramana | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి( Jeevan Reddy ) కాంగ్రెస్ పార్టీ( Congress Party )కి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఉత్కంఠగా మారింది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్( BRS )లో చేరుతారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ.. కారెక్కాలని కోరుతూ జీవన్ రెడ్డిని ఆహ్వానించారు. మొత్తానికి ఎల్ రమణ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
ఏ పార్టీలో గౌరవం లభిస్తుందని భావిస్తారో ఆ పార్టీలోనే నేతలు చేరుతారని ఎల్ రమణ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్‌లో చేరితేనే ఆయనకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచితమైన గౌరవం లభిస్తుందన్నారు. భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదే అని రమణ నొక్కిచెప్పారు.
ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి.. ఏ పార్టీలో చేరుతాననే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డిని రాజకీయంగానే ఎదుర్కొంటానని తేల్చిచెప్పారు. అందర్నీ తొక్కుకుంటూ, అణచివేస్తూ సీఎం పీఠంలో కూర్చుకున్నారని బహిరంగంగానే విమర్శించారు. పార్టీకి ఏం సేవలందించారని వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సీటు ఇచ్చారని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో మండలి సభ్యుడిగా ఆ పార్టీపై ఒంటరిగా పోరాడిన తనకు మంత్రి పదవికి అర్హత లేదా అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.
