KTR | ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాల ప్రచారం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వ‌చ్చాక 32 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని బీఆరెస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు

KTR | ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాల ప్రచారం

32వేల ఉద్యోగాలు కేసీఆర్ హయాంలోనివే
95శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే
మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చిన రాష్ట్రం చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
ఢిల్లీకి కప్పం కట్టేందుకే మంత్రుల ట్యాక్స్‌ల వసూళ్లు
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వ‌చ్చాక 32 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని బీఆరెస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన 32,517ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు, రాతపరీక్షలు, ఫలితాల వెల్లడి ప్రక్రియ తేదీలను ఆయన వివరించారు. నిజంగా రేవంత్‌రెడ్డి 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్త‌వం అయితే ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారో… రాత‌ప‌రీక్ష ఎప్పుడు నిర్వ‌హించారో. ఫ‌లితాలు ఎప్పుడు ఇచ్చారో తెలంగాణ నిరుద్యోగుల‌కు చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు మొత్తం 24,086 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. కేసీఆర్ మాత్రం ఏడాదికి 19 వేల ఉద్యోగాలు ఇవ్వగా, పదేళ్లలో 2,32,308 ఉద్యోగాలకు పరిపాలన అనుమతులు ఇచ్చారని, అందులో 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయటం జరిగిందన్నారు. 1,60,083 ఉద్యోగాల భర్తీ చేయగా,మేం నోటిఫికేషన్ ఇచ్చిన 32, 517 ఉద్యోగాలతో కలిపి 1,92,600 పై చిలుకు ఉద్యోగాలు కేసీఆర్ భర్తీ చేసినవేనన్నారు. గవర్నమెంట్ సెక్టార్ లో 2 లక్షల 36 వేల ఉద్యోగాలు, ప్రైవేట్ సెక్టార్ 24 లక్షల ఉద్యోగాలు కలిపి పదేళ్లలో మొత్తం 26 లక్షల 30 వేల పై చిలుకు ఉద్యోగాలు ఇచ్చామని, ఇంతకంటే ఎక్కువ రిక్రూట్ మెంట్ చేసిన గవర్నమెంట్ పదేళ్లలో ఏదైనా ఉందా? అని సవాల్ చేశారు.

మా కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చినట్లు చూపిస్తే తెల్లారే సరికి నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఇవి కాకుండా టీఎస్ఐపాస్ ద్వారా 24 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, 4 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, పరిశ్రమలు రావటం కారణంగా ప్రైవేట్ సెక్టార్ లో 24 లక్షల ఉద్యోగాలు యువతకు వచ్చాయని వెల్లడించారు. ప్రధాని వద్దకు వెళ్లి ఒత్తిడి తెచ్చి స్థానిక యువతకే 95 శాతం ఉద్యోగాలు వచ్చేలా రిజర్వేషన్ తీసుకొచ్చి…ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. దేశంలోనే 95శాతం స్థానిక రిజర్వేషన్లు అమలవుతున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు దీనిపై సమాధానం చెప్పాలని నేను సవాల్ చేస్తున్నానన్నారు.

హామీలు మరిచారు..వసూళ్లలో మునిగారు

తెలంగాణ యువత నెత్తినిండా అబద్దాలను సోషల్ మీడియా ద్వారా నింపి పెట్టారని, కాంగ్రెస్ కన్నా 19 రెట్లు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ మేము ఈ విషయాలను చెప్పుకోలేకపోయామన్నారు. ఆరు నెలల్లో రేవంత్ ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, మేము డీఎస్సీ ద్వారా 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే..దాన్ని రద్దు చేశాడని, దానికి మరో 5 వేల ఉద్యోగాలు కలిపి కొత్త నోటిఫికేషన్ అంటున్నాడన్నారు. ఎన్నికల్లో చెప్పిన జాబ్ క్యాలెండర్‌, నిరుద్యోగ భృతి ఊసు లేదని, డిప్యూటీ సీఎం భట్టి తాము నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని మాటమార్చారని కేటీఆర్ తప్పుబట్టారు.

స్వయంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నోటి నుంచి నిరుద్యోగ భృతి అనే మాట చెప్పించారని, కానీ ఆ తర్వాత మాట మార్చారన్నారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫ్రీ అన్నారని, అప్పుడు టెట్ ఫీజు రూ. 4 వందలు ఉంటేనే లొల్లి చేశారని, ఇప్పుడు రూ. 2 వేలు చేశారన్నారు. కష్టపడి ప్రైవేట్ సెక్టార్ లో పరిశ్రమలు తెస్తే వాటిని కూడా ఈ సీఎం పాతర వేస్తుంటే బాధనిపిస్తోందని, ఫార్మా సిటీ ఏర్పాటు చేసి 5 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తే దాన్ని రద్దు చేశాడని, దాన్ని రియల్ ఎస్టేట్ చేస్తాడంటున్నారని విమర్శించారు. పరిశ్రమలు రాకుండా ఎక్కడి నుంచి రియల్ ఎస్టేట్ బూమ్ ఉంటుందని ప్రశ్నించారు.

భట్టి ట్యాక్స్, రేవంత్ ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్ ఇలా రాష్ట్రంలో బ్రూ(బీఆర్‌యూ) ట్యాక్స్ మొదలైందని, ఎవరి దుకాణం వాళ్లదేనని ఆరోపించారు. బిల్డర్ల మీద కూడా ట్యాక్స్ వేస్తూ వారి నుంచి కూడా దోచుకుంటున్నారని, రక్తం రుచి మరిగిన పులులు వీళ్లని, పదేళ్లు అధికారంలో లేరని, ఇప్పుడు అందిన కాడికి దోచుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. త్వరలోనే జూపల్లి కృష్ణారావు కూడా కొత్త దుకాణం స్టార్ట్ చేస్తాడంటని తెలిపారు. వారి తీరును మేము అర్థం చేసుకోగలమని, మీరు సామంత రాజులని, ఢిల్లీకి కప్పం కట్టేందుకు ట్యాక్స్ వస్తూలు చేస్తున్నారని పేర్కోన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంటు కోతలు, నీళ్ల కష్టాలు మొదలయ్యాయని, ఆసుపత్రుల్లోనూ కరెంటు కోతలు అమలవుతున్నాయని, కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా కరెంట్ ఇవ్వగలిగారని, వీళ్లకు ఎందుకు చేతనైతలేదని నిలదీశారు.

పదేళ్లు మేము నడిపిన సంస్థలను ఇప్పటికీ ఎందుకు నడపలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎక్కడ పోయినయ్ ప్రశ్నించే గొంతులు, మేధావులు ఎందుకు ఒక్కరు కూడా ప్రశ్నించటం లేదన్నారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మూర్ఖుడని, మంత్రి కాదని, జోకర్ గా మారిపోయారన్నారు. ఎవరైనా మంత్రి నోటి నుంచి కరెంట్ పోతే ఎట్ల అనే మాట వస్తదా? అని ఎద్దేవా చేశారు. కరెంట్ పోతే జనరేటర్ ఉండదా? అంటే ప్రభుత్వాన్ని నడపటం చేతకాని సన్నాసులు కాంగ్రెసోళ్లు అని మండిపడ్డారు. యాదాద్రి ప్లాంట్లతో కలిసి 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి ఈ సన్నాసులకు అప్పగించామని, అయినా సరే కరెంట్ కోతలు లేకుండా నడపలేకపోతున్నారని విమర్శించారు.

మేడిగడ్డ విషయంలో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు చేశారని, కాఫర్ డ్యామ్ కట్టాలని కేసీఆర్ చెప్పిందే చేస్తున్నారని, 5 నెలలు ఆగి, ఆగి ఇప్పుడు కడుతున్నారని, మా మీద కోపం ఉంటే మాతో చూసుకోండి కానీ రైతులను ఇబ్బంది పెట్టకండి అని చెప్పామని, చివరికి నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ చెప్పిందంటూ ఇప్పుడు కాఫర్ డ్యాం కడతారంటా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు అని, సన్నాసి, చేతకాని ప్రభుత్వమని దుయ్యబట్టారు.

వెనక్కి వెళ్లిపోతున్న పారిశ్రామిక సంస్థలు

మేం తీసుకొచ్చిన కేన్స్ టెక్నాలజీస్ సంస్థ 3వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవ్వగా, 15వేల ఉద్యోగాలు వచ్చేవని, వీరు ఏం బ్లాక్ మెయిల్ చేశారోగాని వారు వెళ్లిపోయారని కేటీఆర్ విమర్శించారు. వెయ్యికోట్ల పెట్టుబడులకు కార్నింగ్ సంస్థను ఒప్పిస్తే వారు కూడా కాంగ్రెస్ వచ్చాకా గుజరాత్ వెళ్లిపోయారని, వరంగల్ నుంచి టెక్ మహేంద్ర వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. మధ్య శ్రేణి నగరాలలకు కూడా మేము ఐటీ సంస్థలను తీసుకొచ్చాం. పదేళ్లలో ఏటీ రంగంలో ఎంత అభివృద్ధి చేశామో నాస్ కామ్ లెక్కలే చెబుతాయని, 2014 లో మా ప్రభుత్వం 53 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే 2023 డిసెంబర్ నాటికి 2 లక్షల 40 వేల కోట్లకు ఐటీ ఎగుమతులు చేరాయని, 2023 మే నాటికే ఐటీ 3 లక్షల 50 వేల ఐటీ ఉద్యోగాలుంటే 2023 మే నాటికి 9 లక్షల 8 వందల ఉద్యోగుల వచ్చాయని వెల్లడించారు.

నిజం గడప దాటే లోపే..అబద్దం ఊరంతా తిరుగొస్తదన్నట్లుగా సోషల్ మీడియాలో చేసిన అబద్దపు ప్రచారాలను యూత్ నమ్మారన్నారు. మేం చేసిన పనులను చెప్పుకోలేకపోయామన్నారు. ఉస్మానియా విద్యార్థులను బీరు, బిర్యానీకి ఆశపడే అడ్డా కూలీలంటూ అవమానించింది రేవంత్ రెడ్డి అన్నారు. ఆ విషయాన్ని విద్యార్థులు మరిచిపోతారా? నిజాలన్ని నిలకడగా మీద తెలుస్తాయన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్లు తెలంగాణ అభివృద్ధి కోసం చైతన్యవంతంగా ఆలోచించి బీఆరెస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపిస్తే మీ తరఫున అన్ని హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడన్నారు. బీఆరెస్ అభ్యర్థి చదవుకున్న, గోల్ మెడలిస్ట్ అని, క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి అని, ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయలేదని, అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు.