KTR | లక్ష రుణాలు తీసుకున్న రైతుల సంఖ్యపై కాంగ్రెస్ మోసం

రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డిలు వేర్వేరుగా ఆరోపించారు

KTR | లక్ష రుణాలు తీసుకున్న రైతుల సంఖ్యపై కాంగ్రెస్ మోసం

రుణమాఫీ వివరాలు బహిర్గతం చేయాలన్న కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డిలు

విధాత, హైదరాబాద్ : రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డిలు వేర్వేరుగా ఆరోపించారు. రుణమాఫీలో లబ్ధిదారుల సంఖ్య తక్కువ కావడంపై వారు ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ హయాంలో మొదటి విడత రుణమాఫీ రూ.లక్ష చొప్పున 36 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేశారని, అప్పుడు రూ.17 వేల కోట్లు అయ్యాయని, మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రూ.లక్ష లోపు రుణాలున్న రైతులు 11.5 లక్షల మంది రైతులు మాత్రమే ఎలా ఉంటారని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. రూ.6800 కోట్లు ఇస్తే మొత్తం ఎలా మాఫీ అవుతాయని నిలదీశారు. అసలు లక్ష వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది, రూ.2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది ఉన్నారన్న వివరాలను, రూ.2 లక్షల రుణం మాఫీ చేయడానికి ఎంత అవుతుందో ప్రజలముందుంచాలని వారు డిమాండ్ చేశారు.

భరోసా ప్రభుత్వం కాదు..బాకీ పడ్డ ప్రభుత్వం

కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ప్రభుత్వం కాదని, ప్రజలకు బాకీ పడ్డ ప్రభుత్వమని నిరంజన్ రెడ్డి విమర్శించారు. అబద్దాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. అవే అబద్ధాలతో గోబల్స్ మూర్చపోయే రీతిలో ప్రచారంతో పాలన సాగిస్తోందన్నారు. రూ.6 వేల కోట్లతో రుణమాఫీ పూర్తయిందా ? అని ప్రశ్నించారు. ఈ రోజు లక్ష రుణం మాఫీ చేశామని చెబుతూ రూ.2 లక్షలు మాఫీ చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. యాసంగి రైతుబంధులోనే రూ.2 వేల కోట్లు ఎగ్గొట్టారన్నారు. రైతుభరోసా ప్రకారం చూస్తే రూ.6 వేల కోట్లు ఎగ్గొట్టారన్నారు. వానాకాలం రైతుభరోసా ఊసే లేదన్నారు.. కోటి 30 లక్షల ఎకరాలకే ఇస్తారనుకున్నా రైతులకు ఎకరాకు రూ.7500 చొప్పున రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టారన్నారు. రుణమాఫీ అంటూ ఇప్పుడు రూ.6 వేల కోట్లు ఇచ్చి.. రూ.10 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కోటి 73 లక్షల మంది మహిళలకు ఏడు నెలలుగా నెలకు రూ.2500 చొప్పున బాకీ పడిందన్నారు. దీని అమలుకు ఏడాదికి రూ.41,700 కోట్లు కావాలన్నారు.

40 లక్షల మంది ఫించను దారులు, దివ్యాంగుల ఏడు నెలలుగా పెంచాల్సిన పింఛన్‌ నెలకు రూ.2 వేల చొప్పున బాకీ పడిందన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఏడు నెలలుగా నెలకు రూ.4 వేల చొప్పున భృతి బాకీపడిందన్నారు. రాష్ట్రంలో భూమిలేని కౌలు రైతులు 6.5 లక్షల నుంది ఉన్నారని.. వారికి రూ.15 వేల చొప్పున రూ.975 కోట్లు ప్రభుత్వం బాకీపడిందన్నారు. రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 52 లక్షల మందికి పైగా ఉపాధిహామీ కూలీలు ఉన్నారని.. ఈ లెక్కన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6240 కోట్లు బాకీపడిందన్నారు. కోటి 30 లక్షల టన్నులకు వరిధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున రూ.6500 కోట్లు బోనస్ ఎగ్గొట్టారన్నారు. సేకరించిన ధాన్యానికి కూడా రూ.500 బోనస్ అవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఏటా ఆరులక్షల మంది విద్యార్థులు పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్ఎ, ఎంపిల్ పూర్తి చేసుకుంటున్నారన్నారు. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పది వేల నుండి రూ.లక్ష వరకు బాకీపడిందన్నారు.

కేసీర్ ప్రభుత్వంతో పోల్చితే 25శాతం రైతులకే రుణమాఫీ : కేటీఆర్‌

2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకు మాత్రమే ఇప్పుడు అర్హత ఉందా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని నిలదీశారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రు. 7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లించారని, హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులు కొడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. 2014 లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ. 16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ. 2 లక్షల వరకూ ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలని, అర్హులైన అందరు రైతులకూ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.