ఇద్దరు సీఎంల నీటి పంచాయితీ!

బనకచర్ల ప్రాజెక్టు అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల విషయాన్ని ప్రస్తావించారు. బనకచర్లపై వెనక్కి తగ్గేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

ఇద్దరు సీఎంల నీటి పంచాయితీ!
  • స్వాతంత్ర్య వేడుకల్లో ప్రధానాంశం
  • వృథా జలాలే అంటున్న చంద్రబాబు
  • న్యాయపోరాటానికి సిద్ధమన్న రేవంత్‌

 

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 15 (విధాత) : బనకచర్ల ప్రాజెక్టు అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల విషయాన్ని ప్రస్తావించారు. బనకచర్లపై వెనక్కి తగ్గేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో వాటాను వదులుకొనేది లేదంటూనే.. ఎవరి బెదిరింపులకు లొంగబోమని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వాల కార్యాచరణను రెండు రాష్ట్రాల సీఎంలు బయటపెట్టారు. ఈ ప్రాజెక్టుపై తమ ఎవరి వాదనను వాళ్లు సమర్ధించుకుంటున్నారు. బనకచర్ల నిర్మాణం కోసం చంద్రబాబు, అడ్డుకొనేందుకు రేవంత్ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.

లిప్టులు, టన్నెల్స్ నిర్మించి శ్రీశైలం కుడికాలువలో కీలకమైన బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు వరద నీటిని తరలించడం ఈ ప్రాజెక్టులో కీలకం. బనకచర్ల ప్రాజెక్టును మూడు దశల్లో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి వరద నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలిస్తారు. ప్రకాశం బ్యారేజీని గోదావరి వాటర్ ను తరలించేందుకు కాలువల సామర్థ్యాన్ని, లిప్టులను సామర్థ్యాన్ని పెంచనున్నారు. ఇక రెండో దశలో ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ ను నీటిని తరలిస్తారు. 152 టీఎంసీల రిజర్వాయర్ ను బాబు సర్కార్ ప్రతిపాదిస్తోంది. అయితే దీన్ని 400 టీఎంసీల వరకు పెంచే అవకాశం ఉంది. బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకు మూడో దశలో పనులు నిర్వహిస్తారు. 400 కి.మీ. ఓపెన్ కాలువలు, టన్నెల్స్, పైప్ లైన్స్, తొమ్మిది లిఫ్టులు అవసరం ఉంది. ఈ నీటిని లిఫ్ట్ చేసేందుకు సుమారు 4 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వృథాగా వెళ్లే నీటిని తమ రాష్ట్ర అవసరాల కోసం వాడుకొనేందుకు బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించినట్టు చంద్రబాబు సర్కార్ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామిగా ఉంది. ప్రధానిగా మోదీ కొనసాగాలంటే టీడీపీ మద్దతు అవసరం. ఈ అవకాశాన్ని చంద్రబాబు సర్కార్ తమ రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టుల విషయంలో ఉపయోగించుకుంటున్నది. ఈ ప్రాజెక్టుపై ఎగువ రాష్ట్రమైన తెలంగాణ అభ్యంతరాలను పక్కన పెట్టి ముందుకు వెళ్తామని చంద్రబాబు ప్రకటించారు.

తెలంగాణ అభ్యంతరాలు
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్ అవార్డు 1980 , ఏపీ పునర్వవ్యవస్థీకరణ చట్టం 2014 ను ఏపీ సర్కార్ ఉల్లంఘిస్తోందని తెలంగాణ వాదిస్తోంది. సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నుంచి అనుమతులు లేకుండా ఏపీ సర్కార్ ముందుకు వెళుతన్నదని విమర్శిస్తున్నది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని కృష్ణా బేసిన్ లో ఉండే రైతులకు నష్టం కలుగుతుందని అంటోంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నందున బనకచర్లపై ముందుకు వెళ్తే అవసరమైతే న్యాయపోరాటానికి కూడా వెనుకాడబోమని గతంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టే కాదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా అడ్డుపడకూడదని చంద్రబాబును గత నెలలో రేవంత్ రెడ్డి కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. ఇలా ఏపీపై తెలంగాణ కూడా ఒత్తిడి తెస్తోంది. బనకచర్లపై ఏపీ వ్యూహాలను పరిశీలించి దానికి కౌంటర్ వ్యూహాలను తెలంగాణ సిద్దం చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రాకుండా చేయడం తాము సాధించిన విజయం గా తెలంగాణ చెబుతోంది.

12 మంది నిపుణులతో కమిటీ
బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 12 మంది నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులుంటారు. మిగిలిన ఇద్దరు కేంద్రం నుంచి ఉంటారు. ఒక్కో రాష్ట్రం నుంచి ఐదుగురు చొప్పున పేర్లు పంపాలని వారం రోజుల క్రితం కేంద్రం రెండు రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఆర్ధిక, సాంకేతిక అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా కేంద్రం బనకచర్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.