CM Revanth Reddy | పార్టీ వీడిపోయిన నేతలంతా తిరిగిరండి: సీఎం రేవంత్‌రెడ్డి
గతంలో వివిధ కారణాలతో పార్టీ వీడిపోయిన వైఎస్సార్ అనునయులైన కాంగ్రెస్ నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు

వైఎస్సార్ జయంతిలో సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
రాహుల్‌ను ప్రధాని చేయాలన్న వైఎస్ కల నేరవేరుతుంది
విధాత, హైదరాబాద్: గతంలో వివిధ కారణాలతో పార్టీ వీడిపోయిన వైఎస్సార్ అనునయులైన కాంగ్రెస్ నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్లోని సిటీ సెంటర్ వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం గాంధీభవన్‌లో జరిగిన వైఎస్సార్ జయంతిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. “వైఎస్ఆర్ పాదయాత్రతో గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇటీవల రాహుల్ గాంధీ పాదయాత్రతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉందని, రాహుల్‌ను ప్రధాని చేయాలని వైఎస్సార్ సంకల్పించారని, రాహుల్‌ను ప్రధానిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుందని చెప్పారు. రాహుల్‌గాంధీ ప్రధాని పదవికి అడుగు దూరంలో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ స్ఫూర్తితోనే రాహుల్ గాంధీని ప్రధానిని చేసే విధంగా మనం ముందుకెళ్లాలని సూచించారు. వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం, అభివృద్ధి అని పేర్కోన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలనే ఆలోచన వైఎస్సార్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన వారికి చైర్మన్ పదవులు ఇచ్చామని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు ప్రయత్నించేవారు మాత్రమే వైఎస్ఆర్ కు నిజమైన వారసులు అని.. రాహుల్ గాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా వెళ్లేవారు వైఎస్ వారసులు కాదన్నారు. అలాగే సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజున తాను తెలంగాణ పీసీసీగా బాధ్యతలు చేపట్టానని, పీసీసీ అధ్యక్షుడిగా మూడు సంవత్సరాలు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, సినియర్ కాంగ్రెస్ నాయకులు కేవిపి రామచందర్‌రావు, మధు యాష్కి, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.