విధాత, మహబూబ్ నగర్ :
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత పాలకులు మక్తల్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. అందుకే మక్తల్ నుంచే ప్రజాపాలన విజయోత్సవాలను ప్రారంభించామన్నారు. సంగం బండ, జూరాల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
వీటిని పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుందని.. ప్రాజెక్టుల్లో నష్టపోతున్న రైతులకు ఎకరాకు రూ.20 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ తో పాటు వలసలను దూరం చేసేందుకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీ స్కూళ్లను నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. దేశ అభివృద్ధిలో పాలమూరు బిడ్డలు భాగస్వామ్యం కావడానికి విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడించారు. దీని కోసం ఐఐటీ తో పాటు కాలేజీలు, పాఠశాలలను తీసుకొచ్చామన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే కొందరు కండ్లల్లో మన్ను పోసుకుంటున్నారని విమర్శించారు. ఇంటింటికి సన్నబియ్యం, ఉచిత కరెంట్ అందజేస్తున్నామని తెలిపారు.స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు సీఎం అయ్యారని, ఆ తరువాత ఎవరూ కాలేదని చెప్పారు. ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాడు అని అన్నారు. దశాబ్దాలుగా పాలమూరు జిల్లా కరవు, వలసలకు మాత్రమే పేరు పొందిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా గ్రామాభివృద్ధికి పాటుపడే అభ్యర్థిని గెలుపించుకోవాలన్నారు. మంచోడిని గెలిపిస్తే అభివృద్ధి చేస్తాడని.. ముంచెటోడికి అవకాశం ఇవ్వద్దని సీఎం కోరారు. ఈఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి జి మధుసూదన్ రెడ్డి అనిరుద్ రెడ్డి రాజేష్ రెడ్డి వంశీకృష్ణ మేఘారెడ్డి , సీతా దయాకర్ రెడ్డి శివకుమార్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు వనపర్తి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు(మం), అమరచింత మున్సిపాలిటీల పరిధిలో రూ.151.92 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
