హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరిస్తున్నా: సీఎం రేవంత్‌రెడ్డి

ఆగస్టు 15వ తేదీలోగా 2లక్షల రైతు రుణమాఫీ చేస్తానని, చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలన్న బీఆరెస్‌ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు

  • Publish Date - April 26, 2024 / 02:23 PM IST

ఆగస్టు 15లోగా 2లక్షల రుణమాఫీ చేస్తా
రాజీనామాతో సిద్ధంగా ఉండాలని ప్రతిసవాల్‌
మీరు దోచుకున్న దానికంటే రైతు రుణమాఫీ ఎక్కువేమి కాదు
రైతుల రుణమాఫీ చేయకపోతే ఇక మాకు అధికారం ఎందుకని వ్యాఖ్యలు
అమరవీరుల స్థూపం హరీశ్‌రావు మోసానికి ముసుగు
ఆయన రాజీనామా లేఖ స్పీకర్‌ ఫార్మాట్‌లో లేదు..సీస పద్యం మాదిరిగా ఉందంటు సెటైర్‌

విధాత: ఆగస్టు 15వ తేదీలోగా 2లక్షల రైతు రుణమాఫీ చేస్తానని, చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలన్న బీఆరెస్‌ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఇదే అంశాన్ని సోషల్‌ మీడియా బృందం ప్రజలకు స్పష్టంగా చెప్పాలన్నారు. హరీష్ రావు తన రాజీనామా చిట్టి(లేఖ) సిద్ధంగా ఉంచుకోవాలని ప్రతి సవాల్‌ విసిరారు.

పంద్రాగస్టు తర్వాతా సిద్దిపేటకు నీ శని వదులుతది..చింతమడకపోయి చింత చెట్టుకింద పడుకో అన్నారు. రైతుల సమస్యలు తీర్చేందుకే తాము ఉన్నామని.. తీర్చలేని పరిస్థితిలో అధికారం ఎందుకన్నారు. తప్పకుండా రుణమాఫీ చేస్తామని అయితే 30నుంచి 40వేల కోట్లు ఖర్చు కావచ్చని, నీవు కాళేశ్వరం పేరుతో దోచుకున్న లక్ష కోట్ల కంటే..హైదరాబాద్‌ చుట్టు భూముల పేరుతో దోచుకున్నవేలాది ఎకరాల కంటే రైతురుణమాఫీ ఎక్కువ కాదన్నారు. మీలాగా దోపిడి చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే బ్యాంకులకు రుణమాఫీ మొత్తం ఎడమ చేతితో చెల్లిస్తానన్నారు.

హరీశ్‌రావుకు ఎప్పుడు ప్రజలను మోసం చేయాలనుకుంటే అమర వీరుల స్థూపం గుర్తొస్తుందని, నీ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపమని, దాని వెనుకాల దాసుకుని అబద్ధాలు చెబుతున్నాడని, ఇన్నాళ్లుగా అమరవీరుల స్థూపం దగ్గరకు పోని హరీశ్‌రావు ఇప్పుడు అక్కడికి వెళ్లి రాజకీయం చేస్తున్నాడన్నారు. హరీశ్‌రావు తన రాజీనామా పత్రాన్ని మామ కేసీఆర్‌ చెప్పినట్లుగా సీసీ పద్యం మాదిరిగా రుణమాఫీ కాకుండా ఇంకా ఏవేలో రాసుకొచ్చాడని, అది స్పీకర్‌ ఫార్మాట్‌లో లేదన్నారు. అదో పెద్ద తెలివనుకుంటున్నాడని, తాటి చెట్టులాగా పెరిగితే కాదని, నీ తెలివితేటలు అరికాళ్లకు పోయినట్లుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల వేళ బీఆరెస్‌, బీజేపీలు చేసే ఇటువంటి జిమ్మిక్కులను, కుట్రలను కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర జరుగుతోందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

సెమిఫైనల్లో కేసీఆర్‌ను ఓడించాం..ఫైనల్లో మోదీని ఓడిస్తాం

బీజేపీ అంటే.. భారతీయ బ్రిటీష్ విధానం అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శంచారు. మోడీ, అమిత్ షా బ్రిటీష్ విధానంతో ముందుకు వెళ్తున్నారని, దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలనేదే వారి విధానమని తెలిపారు. బీజేపీకి ఈ భావజాలం ఆరెస్‌ఎస్‌ నుంచి వచ్చిందని తెలిపారు. బీజేపీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని మరోసారి ఆరోపించారు. టెస్టులు, వన్డే మ్యాచ్లు అదే రోజులు ఇవి కాదని.. ఇప్పుడంతా టీ20 ట్రెండ్ నడుస్తోందని అన్నారు. సెమీ ఫైనల్లో కేసీఆర్‌ను ఓడించాం. ఇక ఫైనల్లో మోడీని ఓడించబోతున్నట్లు ప్రకటించారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెళ్లో ఉండాలని, అంతేగాని రోజూ రోడ్డుమీద దేవుడి పేరు చెప్పి. ఓట్లు అడగటం వారికే చెల్లుతుందని విమర్శించారు. పండుగలు వస్తే చాలు బీజేపీ సమస్యలు సృష్టించడానికి రెడీగా ఉంటుందని విమర్శించారు.

Latest News