Site icon vidhaatha

Singareni | భారీ వర్షాలతో సింగరేణీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి .. రోజుకు 80వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌

కొనసాగుతున్న గోదావరి పరవళ్లు
భద్రాచలం వద్ద 40.5అడుగులకు చేరిన నీటి మట్టం
మేడిగడ్డ 85గేట్ల నుంచి దిగువకు వరద ఉదృతి

విధాత, హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా సింగరేణీ కోల్‌బెల్ట్‌లోని జిల్లాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు, కోయగూడెం ఓపెన్‌కాస్ట్‌ గనుల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 35 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామికవాడలో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఇక్కడ నాలుగు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రోజుకు 80 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో చేరిన నీటిని అధికారులు బయటకు పంపిస్తున్నారు. ఇక భారీ వర్షాలతో నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రాజెక్టులోకి 19,686 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 18,227 క్యూసెక్కుల వరద బయటకు వెళ్తున్నది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌లోకి 385 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుతం 1387 అడుగులుగా ఉన్నది.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 4.06 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 85 గేట్లు ఎత్తి వరదను వదులుతున్నారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకున్నది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో 10 మీటర్ల ఎత్తులో వరద ప్రవహం ఉన్నది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. అధికారులను అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. నీటిమట్టం 43 అడుగులు దాటితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు నీటి మట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ప్రస్తుతం వర్షాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగితే వరద పెరిగే అవకాశం ఉన్నది.1986 సంవత్సరంలో చరిత్రలోనే గరిష్ఠంగా గోదావరి నీటి మట్టం 75.60 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇదే ఇప్పటి వరకు రికార్డు. 2022లో కురిసిన జోరువానకు 71.30 అడుగులకు నీటిమట్టం పెరిగింది. 1990లో 70.3 అడుగులకు, 2006లో 66.9 అడుగులకు, 1976లో 63.9 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం చేరింది.

Exit mobile version