మీ రైతుబంధు రాజకీయం.. మా రైతు పథకాలు సంస్కరణలు: కోదండరెడ్డి

విధాత : ఎన్నికల కోడ్ నేపధ్యంలో నవంబర్ 2లోపుగానే రైతుబంధు వేయాలన్న కాంగ్రెస్ ఫిర్యాదుపై బీఆరెస్ నేతలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని, నిజానికి బీఆరెస్ రైతుబంధు రాజకీయ సాధనమైతే, కాంగ్రెస్ గతం నుంచే కొనసాగిస్తున్న రైతు పథకాలు వారి సంక్షేమానికి తెచ్చిన సంస్కరణలని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి శుక్రవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ అధికార ప్రతినిధి రమణి, టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా చట్టాలని గౌరవిస్తుందన్నారు. అధికార దుర్వినియోగం చేయదన్నారు. 2014, 2018 ఎన్నికల సందర్భంగా బీఆరెస్ అధికార దుర్వినియోగం చేసిందని విమర్శించారు. రైతు బంధు విషయంలో బీఆరెస్ నాయకుల మాటలు హద్దులు దాటుతున్నాయన్నారు. రైతు బంధు అనే పధకాన్ని వేరే పేరుతో 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టిందన్న సంగతి మరువరాదన్నారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి హయంలో వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చామని, రైతు బకాయిలు మాఫీ చేశామని, మీరు పొత్తులో ఉన్నపుడే మేం రైతు సంస్కరణలు అమలు చేశామన్నారు.
రైతుకు మినిముమ్ సపోర్ట్ ప్రైజ్ కాంగ్రెస్ తెచ్చిందని, ఎంఎస్పీ జాబితాలో లేని పంటలను కూడా కొనుగోలు చేసిందన్నారు. బీఆరెస్ ప్రభుత్వం పంటల కొనుగోలులో నెలల తరబడి రైతులను పడిగాపులకు గురి చేస్తు వారి చావులకు కారణమవుతుందన్నారు. పాలకేంద్రాలను, కోళ్ల పరిశ్రమలను కాంగ్రెస్ అభివృద్ధి చేసిందన్నారు. రైతు పంట రుణాల ఏకకాల రుణమాఫీ చేశామన్నారు. 2018లో ధరణి పేరుతో తెలంగాణలో అధికారిక భూ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అయోద్యరెడ్డి, కమలాకర్, నిజాముద్దీన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.