ఢిల్లీలో గాలి నాణ్యత కాస్త మెరుగు

ఢిల్లీలో గాలి నాణ్యత కాస్త మెరుగు
  • సివియ‌ర్ నుంచి వెరీ పూర్‌గా మార్పు
  • సోమవారం సాయంత్రం 4 గంటలకు
  • ఏక్యూఐ 421 నుంచి 394కు త‌గ్గింపు



విధాత‌: దేశ రాజ‌ధానిలో వాతావ‌ర‌ణం కాస్త మెరుగుప‌డింది. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో వాయు కాలుష్యం కొంత‌మేర త‌గ్గింది. ఐదు రోజుల త‌ర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత మంగళవారం ఉదయం స్వల్పంగా మెరుగుపడింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) సోమవారం సాయంత్రం 4 గంటలకు 421 నుంచి ఈ ఉదయం 394కి పడిపోయింది. సివియ‌ర్ నుంచి వెరీ పూర్‌గా మార్పు చెందింది.


కాలుష్యం తగ్గుముఖం పట్టినప్పటికీ, ఊపిరితిత్తుల్లో చేరి ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే మైక్రోస్కోపిక్ PM2.5 కణాలు ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ సురక్షిత పరిమితి క్యూబిక్ మీటర్‌కు 60 మైక్రోగ్రాముల కంటే ఏడు నుంచి ఎనిమిది రెట్లు పెరిగాయి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సురక్షిత పరిమితి క్యూబిక్ మీటరుకు 15 మైక్రోగ్రాముల కంటే 30 నుంచి 40 రెట్లు ఎక్కువ.


హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని అనేక సమీప నగరాలు కూడా ప్రమాదకరమైన గాలి నాణ్యతతో బాధపడుతున్నాయి. ఘజియాబాద్‌లో ఏక్యూఐ 338, గురుగ్రామ్‌లో 364, నోయిడాలో 348, గ్రేటర్ నోయిడాలో 439, ఫరీదాబాద్‌లో 382గా న‌మోద‌యింది. దీపావళి తర్వాత గాలి నాణ్యత మరింతగా క్షీణిస్తుంద‌నే భయంతో ఢిల్లీ ప్రభుత్వం సోమవారం మ‌రిన్ని దిద్దుబాటు చ‌ర్య‌లుచేప‌ట్టింది. బేసి-సరి నంబ‌ర్ వాహ‌నాల కార్య‌క్ర‌మాన్నితిరిగి ప్ర‌వేశ‌పెట్టింది.


వాయు కాలుష్యం హానికరమైన ప్రభావాల నుంచి విద్యార్థులను రక్షించడానికి, ఢిల్లీ ప్రభుత్వం ఈనెల‌10 వరకు సెల‌వులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న 10-12 తరగతులకు మాత్రం మినహా ఇచ్చింది.