Bhatti Vikramarka | విధాత, ప్రత్యేక ప్రతినిధి: సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందేంటి? నీకు అర్ధమైంది ఏంటి? అంటూ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌ను ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూటిగా ప్రశ్నించారు. మొన్నటి బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ రెండు ప్రభుత్వాల అభివృద్ధిపై శాసనసభలో చర్చించేందుకు మాజీ సీఎం కేసీఆర్ నుద్దేశించి చర్చకు సిద్ధమా? అని సవాల్ చేస్తే, ఆ సవాల్ స్వీకరించకుండా ఎవరు పడితే వాళ్లు ఎక్కడబడితే అక్కడ చర్చకు సిద్ధమంటే ఇదేం పద్ధతి? అంటూ నిలదీశారు. మహబూబాబాద్ జిల్లాలో సోమవారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో భట్టి ప్రసంగించారు. పదేళ్లలో నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే శాసనసభలో చర్చకు రండి అంటూ బీఆర్ఎస్ నాయకులకు మరోసారి సవాల్ చేశారు. సవాల్ పైన శాసనసభలో చర్చించకుండా మీరు ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్ దక్కదన్నారు. వచ్చే శాసనసభ నాటికి పార్టీ అడ్రస్ గల్లంతైతదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. లక్ష రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చి చేతులెత్తేసిన విషయాన్ని అప్పుడే మర్చిపోయారని మండిపడ్డారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలలలో 21 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామన్నారు. ఇన్సూరెన్స్ అమలు, ఉచిత విద్యుత్ అందించామని, సన్నాలకు రూ. 500 బోనస్ అందించామని వివరించారు. తమ ఏడాది పాలనలో రూ. 70 వేల కోట్ల రైతు సంక్షేమానికి ఖర్చు చేశామని తేల్చి చెప్పారు.
కృష్ణా గోదావరి నీళ్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం
కృష్ణ , గోదావరి నీళ్లపై శాసనసభలో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి చెప్పారు. కేసీఆర్ చర్చకు రావాలని చాలెంజ్ చేశారు. రాష్ట్రం ఏమైనా ఫరవాలేదు కృష్ణ, గోదావరి నీళ్లు వాడుకోండని నాడు సీఎం గా ఉన్న కేసీఆర్ ప్రకటించారా? లేదా? అంటూ నిలదీశారు. రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసం అనే విషయాన్ని బీఆర్ఎస్ ఎప్పుడో విస్మరించిందని మండిపడ్డారు. ఈ నెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ గొప్పగా చెప్పుకునే లక్ష కోట్లు ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం పది ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. వాస్తవాలు బయటికి వస్తున్నాయని, ఆ డబ్బంతా ఎటుపోయిందో తేలుతుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారు.. ఇకనైనా అబద్ధాలు మానుకుంటే భవిష్యత్తు ఉంటుందని భట్టి హితవు పలికారు. ఈ సభలో రాష్ట్ర మంత్రు లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ నియోజకవర్గంలో రూ. 100 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.