Dharani । ధరణితో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల్లో 50లక్షల మంది భూ బాధితులే!

దశాబ్దాలుగా గ్రామస్థాయిలో సుమారు 64 రకాల విధులను నిర్వర్తించి, ప్రభుత్వ ప్రతినిధులుగా వీఆర్వోలు గౌరవంగా బతికారని ఆయన తెలిపారు. అలాంటి వ్యవస్థను నాటి సీఎం కేసీఆర్ అహంకార ధోరణితో రద్దుచేశారని ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రంలోని 5,139 మంది ఏఆర్వోలకు ఉద్యోగ భద్రతలేక తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని, 178 మంది వీఆర్వోలు బలవన్మరణాలు, మానసిక రుగ్మతలతో చనిపోయారనీ ఉపేంద్రరావు గుర్తు చేశారు.

Dharani ।తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న నూతన రెవెన్యూ చట్టం ‘భూమాత’తోనే ప్రజలకు, ముఖ్యంగా 70 లక్షల మంది రైతులకు న్యాయం జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతోనే పూర్వ వీఆర్వోలకు సముచిత స్థానం దక్కుతుందని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులు, వీఆర్వోలు అరిగోస పడ్డారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి ఆశాస్త్రీయంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలోని 50లక్షల మంది రైతులు బాధితులుగా మారిపోయారని చెప్పారు. దశాబ్దాలుగా గ్రామస్థాయిలో సుమారు 64 రకాల విధులను నిర్వర్తించి, ప్రభుత్వ ప్రతినిధులుగా వీఆర్వోలు గౌరవంగా బతికారని ఆయన తెలిపారు. అలాంటి వ్యవస్థను నాటి సీఎం కేసీఆర్ అహంకార ధోరణితో రద్దుచేశారని ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రంలోని 5,139 మంది ఏఆర్వోలకు ఉద్యోగ భద్రతలేక తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని, 178 మంది వీఆర్వోలు బలవన్మరణాలు, మానసిక రుగ్మతలతో చనిపోయారనీ ఉపేంద్రరావు గుర్తు చేశారు. “వీఆర్వో వ్యవస్థ రద్దు చట్టం, 2020” ప్రకారం వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్ తత్సమాన పోస్టుల్లో నియమించాల్సి ఉండగా, కొన్ని ప్రభుత్వ శాఖలలో శాంక్షన్‌ పోస్టులు లేక జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువైన “తోటమాలి/వార్డ్ ఆఫీసర్/ రికార్డ్ అసిస్టెంట్ / స్టోర్ కీపర్/ కంప్యూటర్ ఆపరేటర్/ హాస్టల్ వర్కర్/ లైబ్రేరియన్/ డ్రైవర్లు /వంట మనిషి/ కామటి/ స్వీపర్” వంటి పోస్టుల్లో నియమించారని ఉపేంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్‌లో ‘గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ, వీఆర్వోల పాత్ర..’ అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్ షాపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గరికె ఉపేంద్రరావు మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన రెవెన్యూ చట్టం భూ మాత తోనే రాష్ట్రంలోని రైతులకు, సామాన్య ప్రజలతో పాటు పూర్త వీఆర్వోలకు సముచిత స్థానం కలుగుతుందన్నారు. అందుకే కొత్త ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని అన్నారు.

గత బీఆర్ఎస్ పాలనలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల పార్ట్ బీ తో 18లక్షల మంది రైతులు బాధితులుగా మారిపోయారనీ, కాస్తు కాలం తొలగించడంతో మరో 9లక్షల మంది రైతులు బాధితులుగా మారిపోయారనీ, మొత్తం మీద రాష్ట్రంలోని సుమారు 70లక్షల మంది రైతుల్లో ఏకంగా 50లక్షల మంది రైతులు బాధితులుగా మారిపోయారని గరికె ఉపేంద్ర రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న భూమాత చట్టంతో గ్రామ స్థాయిలో భూ సమస్యలు పరిష్కరించుకునేలా వెసులుబాటు కల్పించడానికి వీలుగా చట్టం రూపొందించడం గొప్ప వరమని అన్నారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేసేలా రూపకల్పన చేయడం శుభ పరిణామమని అన్నారు. సమస్త రైతుల భూముల పరిరక్షణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ, కట్టుదిట్టమైన చర్యలకు భూమాత చట్టంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలోనే రెవెన్యూ పరమైన విధులు నిర్వర్తించడానికి ఒక అధికారిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హర్షించదగిన విషయమన్నారు. ప్రతీ 2వేల జనాభాకు ఒక సహాయకుడు, 10,954 రెవెన్యూ గ్రామాలుగా, సుమారు 16వేల క్లస్టర్లలో ప్రతీ క్లస్టర్కు ఒక ఉద్యోగిని నియమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సారధ్యంలో తీసుకొస్తున్న భూమాత చట్టం రెవెన్యూ వ్యవస్థలోనే ఒక సంచలన నిర్ణయమనీ, ఈ చట్టం కోసం యావత్ రాష్ట్ర ప్రజలు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రతీ రెవెన్యూ క్లస్టర్కు ఉద్యోగిని నియమిస్తామని చెప్పడం పూర్వ వీఆర్వోలకు గొప్ప వరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుడు చర్యలతో బాధితులుగా మారిన రాష్ట్రంలోని 5,139 మంది పూర్వ వీఆర్వోలకు మళ్లీ కొత్త చట్టం ద్వారా స్థానం కల్పించి మా సేవలను వినియోగించుకోవాలని గౌరవ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గరికె ఉపేంద్రరావు వేడుకున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న భూమాత చట్టం కోసం అహర్నిశలు పనిచేసి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్ యావత్ రెవెన్యూ వ్యవస్థ, వీఆర్వోలు, రైతుల పాలిట ఓ పీడ కల అని గరికె ఉపేంద్రరావు విమర్శించారు. ధరణి పోర్టల్ వల్ల తమ భూములు కోల్పోయిన రైతుల ఆగ్రహంతో కుత్బుల్లాపూర్ మెట్లో తహసీల్దార్ పనిచేసిన విజయరెడ్డి దారుణ హత్యకు గురయ్యారనీ, నిజామాబాద్లో మరో తహసీల్దార్ మానసిక వేదనతో బలవన్మరణాకి పాల్పడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో, సున్నం రామరావు, ప్రసాద్ వి రామారావు జిల్లా నాయకులు స్వామి దాసు, నాగేంద్రబాబు, ఎస్ కె సుభాని, లక్ష్మీ నర్సు, కృష్ణ, వరలక్ష్మి, విజయలక్ష్మి, వెంకటరమణ, మేడికొండ బాలయ్య, బండ కృష్ణయ్య, చర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.