శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఓపెన్…సాగర్ కు కృష్ణమ్మ పరుగులు
కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. నది పరివాహక ప్రాజెక్టు ల్లో వరద ఉప్పొంగుతోంది. ఆల్మట్టి, నారాయణ పూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టు లు నిండి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.

– కృష్ణమ్మ పరవళ్లు
– శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఓపెన్…సాగర్ కు కృష్ణమ్మ పరుగులు – ఐదు గేట్ల ద్వారా 1.96 లక్షల క్యూ సెక్కుల నీటి విడుదల
– ప్రస్తుతం ప్రాజెక్టు లో 201 టీఎంసీ ల నీరు నిలువ
– పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీ లు
– ఇన్ ఫ్లో 4.50 లక్షల క్యూ సెక్కులు.. అవుట్ ఫ్లో 1.42 లక్షల క్యూ సెక్కులు
– విద్యుత్ ఉత్పత్తి కోసం 56 వేల క్యూ సెక్కుల విడుదల
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. నది పరివాహక ప్రాజెక్టు ల్లో వరద ఉప్పొంగుతోంది. ఆల్మట్టి, నారాయణ పూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టు లు నిండి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.సోమవారం సాయంత్రం వరద ఉదృతి పెరగడం తో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. మంగళవారం కృష్ణా నది లో ప్రవాహం ఎక్కువ కావడం తో ఉదయం 11 గంటలకు మరో రెండు గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు విడుదల చేశారు. ప్రస్తుతం ఐదు గేట్ల ద్వారా 1.42 లక్షల క్యూ సెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 56 వేల క్యూ సెక్కుల నీటిని వదులుతుండగా మొత్తంగా 1.96 క్యూ సెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి విడుదల అవుతోంది.ఎగువ నుంచి 4.42 క్యూ సెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెకు వచ్చి చేరుతోంది. 215 టీఎంసీ నీటి సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు లో ప్రస్తుతం 202 టీఎంసీ ల నీరు నిలువ ఉంది. నీటి మట్టంగా చూస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగుల నీరు నిలువ ఉంచి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.రోజు రోజుకు వరద పెరుగుతుందడం తో ఇలాగే కొనసాగితే వారం పది రోజుల్లో నాగార్జున సాగర్ నిండే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి వేయడం తో ప్రాజెక్టు వద్ద సందర్శకులు పోటెత్తారు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా పోలీసులు గట్టి బందో బస్తు నిర్వహిస్తున్నారు.
రేపు శ్రీశైలంకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టు సందర్శనకు రానున్నారు. ఈ సందర్బంగా ఆయన కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారని తెలుగుదేశం పార్టీ వెల్లడించింది.సీఎం తో పాటు ఏపీ కి చెందిన మంత్రులు, నీటి పారుదల శాఖ అధికారులు రానున్నారు.