TGPSC | వన్ టైమ్ రిజిస్ట్రేషన్( OTR ) అప్డేట్ విషయంలో టీజీపీఎస్సీ( TGPSC ) కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఓటీఆర్ సవరణకు మార్చి 25 చివరి తేదీ. కానీ నిరుద్యోగుల అభ్యర్థనల మేరకు టీజీపీఎస్సీ మరోసారి గడువు పొడిగించింది. ఏప్రిల్ 10వ తేదీలోపు ప్రతి అభ్యర్థి.. తమ విద్యార్హతలతో పాటు ఇతర ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలని టీజీపీఎస్సీ సూచించింది. ఏప్రిల్ 10వ తేదీ తర్వాత అవకాశం ఉండదని, ఇప్పుడు ఇచ్చే డేటాను మాత్రమే భవిష్యత్‌లో వచ్చే నోటిఫికేషన్లకు ప్రామాణికంగా తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
మరి ముఖ్యంగా ఎస్సీ విద్యార్థులు ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ తర్వాత ఎస్సీ అభ్యర్థులకు కొత్తగా కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నారు. వర్గీకరణ జరిగిన నేపథ్యంలో భవిష్యత్‌లో వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణను అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ అభ్యర్థలు కొత్తగా కుల ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి.
ఓటీఆర్ అప్డేట్‌లో తప్పనిసరిగా కొత్త కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి. అదనపు విద్యార్హతలు, చిరునామా , ఈడబ్యూఎస్, నాన్-క్రీమీ లేయర్ , మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీలను మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. మిగిలిన వివరాలు మార్చడానికి వీలుండదని టీజీపీఎస్సీ పేర్కొంది. అభ్యర్థులు ఇచ్చే ఓటీఆర్ వివరాలనే భవిష్యత్తులో ఉద్యోగ దరఖాస్తులకు ప్రాథమిక సమాచారంగా చూస్తారు.
