Telangana Formation Day 2024 | ఉద్యమకారులకు వేడుకల్లో తొలిసారి భాగస్వామ్యం

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఆవిర్భావ అధికారిక వేడుకల్లో తొలిసారిగా ఉద్యమకారులకు భాగస్వామ్యం దక్కిందిన టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు.

  • Publish Date - May 30, 2024 / 10:03 PM IST

సీఎంకు ఉద్యమకారుల జాబితా అందించాం : కోదండరామ్‌
లోగో అంశాన్ని ప్రస్తావించిన తమ్మినేని
వారి పేర్లను రాష్ట్ర గేయంలో చేర్చాలన్న కూనంనేని

విధాత, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఆవిర్భావ అధికారిక వేడుకల్లో తొలిసారిగా ఉద్యమకారులకు భాగస్వామ్యం దక్కిందిన టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డితో గురువారం సాయంత్రం జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లు ఉద్యమకాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఉద్యమకారుల జాబితాను అందించామన్నారు. వారికి రాష్ట్ర అవతరణ వేడుకల్లో సన్మానం ఉంటుందన్నారు. రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణకు ఆమోదం తెలిపామని, జూన్ 2 రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం ఆవిష్కరిస్తారన్నారు. ఉదయం ఉత్సవాలు, సాయంత్రం సంబరాలు ఉంటాయన్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నం ప్రజల జీవితాలను ప్రతిబింబించేలా ఉండాలని, కట్టడాలు లోగోలో పెట్టడం కాదని చురకలేశారు.

లోగో అంశాన్ని ప్రస్తావించిన తమ్మినేని

రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశణలో తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు అంశాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రస్తావించారు. కాకతీయయ కళాతోరణం, చార్మినార్‌లను లోగో నుంచి తీసేసినట్లుగా ప్రచారం జరుగుతుందని తమ్మినేని చెప్పారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి లోగో అంశం ఈ సమావేశం అజెండాలో లేదని, అందరు అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే లోగో పై చర్చించి ముందుకెలుతామని స్పష్టం చేశారు.

వారి పేర్లను తెలంగాణ గీతంలో చేర్చాలన్న కూనంనేని

తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంలో ముగ్దూంమోహిణుద్దీన్ పేరును జత పర్చాలని సీపీఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. సానుకూలంగా స్పందించిన రేవంత్‌రెడ్డి ఆ పేరుతో పాటు షేక్ బంధగీ, కొమురం భీం పేర్లు కూడా రాష్ట్ర గీతంలో పొందు పర్చేందుకు అంగీకారం తెలిపారు. ఆ బాధ్యతను అందేశ్రీ చూసుకోవాలని సూచించారు. రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పుపై కేబినెట్ ,అసెంబ్లీ లో చర్చించిన తర్వాతే ప్రకటిస్తామని, తెలంగాణ ఉద్యమ స్పూర్తి, అందరి అభిప్రాయాల తర్వాతనే నిర్ణయం ఉంటుందని, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఈ అంశంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు.

Latest News