FDI .. రాష్ట్రానికి ఎఫ్డీఐల వెల్లువ.. నిరుటి కంటే 33 శాతం వృద్ధి
కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ ఆరు నెలల పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ దేశంలో ఆరో స్థానంలో నిలిచింది.

రాష్ట్రానికి ఈ ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (Foreign Direct Investment) ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఆరు నెలల్లో రాష్ట్రానికి 12,864 కోట్లు వచ్చాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో రూ.9,679 కోట్లు వచ్చాయి.గత ఏడాదితో పోలిస్తే రూ.3,185 కోట్లు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 33 శాతం ఎఫ్డీఐల వృద్ధి నమోదైంది.
కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ ఆరు నెలల పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ దేశంలో ఆరో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఎఫ్‌డిఐలలో దాదాపు 93 శాతం హైదరాబాద్‌లోనే వచ్చాయి. రాష్ట్ర రాజధానికి రూ.11970 కోట్లు, రంగారెడ్డి జిల్లాకు రూ.680.5 కోట్లు, మహబూబ్‌నగర్‌కు రూ.116.7 కోట్లు, మెదక్‌కు 96.99 కోట్లు వచ్చాయి.