Site icon vidhaatha

G. Jagadish Reddy | సీఎం రేవంత్‌రెడ్డి డైరక్షన్‌లో బీఆరెస్ శ్రేణులపై దాడులు : మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి

రాసి పెట్టుకోండి..వాళ్ల లాగా దొంగ దెబ్బ తీయం.. చెప్పి చేద్దాం

విధాత, హైదరాబాద్ : రైతుల రుణమాఫీ సమస్యలపై బీఆరెస్ చేపట్టిన నిరసనల సందర్భంగా మా పార్టీ శ్రేణులపై కాంగ్రెస్ శ్రేణులు దాడులు సీఎం రేవంత్‌రెడ్డి డైరక్షన్‌లోనే జరుగుతున్నాయని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో బీఆరెస్ శ్రేణులపై జరిగిన దాడి సమాచారం తెలుసుకున్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి తిరుమగిరి వెళ్లి తిరిగి బీఆరెస్ ధర్నాను కొనసాగించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న తిరుమలగిరి బీఆరెస్ శిబిరంపై కాంగ్రెస్ దాడిని ఖండిస్తున్నామన్నారు.

రేవంత్ డైరెక్షన్‌లోనే బీఆరెస్‌పై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. హామీల అమలు వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ మోసాలు బయటపడకుండా ఉండేందుకు హింసను ప్రేరేపిస్తున్నారన్నారు. పోలీసుల సమక్షంలోనే శిబిరాన్ని కూల్చివేశారని, కాంగ్రెసుతో కలిసి పోలీసులు పనిచేస్తిన్నట్లుగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ దాడుల ఖాతాలను రాసి పెట్టాలని, మంచి సందర్భం మనకు వస్తదని , మనకు అధికారంలోకి వచ్చాకా అలాంటి పనులు చేయబోమని, ఈలోగానే ఏదైనా చేస్తే చెప్పి చేస్తామని, రుణం తీర్చేస్తామని, రేవంత్‌, వెంకట్‌రెడ్డిల మాదిరిగా దొంగల్లాగా చేయబోమన్నారు.

రుణమాఫీ పై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన లేదన్నారు. చెయ్యని రుణమాఫీకి కాంగ్రెస్ ప్రచారాలతో డంబాచారాలకు పోతుందన్నారు. రుణమాఫీ పై రైతులు స్వచ్ఛందంగా ఆందోళనలు చేస్తున్నారని, స్వయానా మంత్రులే పూర్తిస్థాయిలో మాఫీ కాలేదని చెబుతున్నా ప్రభుత్వం కవరింగ్ చేస్తుందన్నారు. దాడులు చేసి రెచ్చగట్టాలని చూస్తున్నారని, ఎన్ని దాడులు చేసినా ప్రజల కోసం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తిరుమలగిరి సంఘటన పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి న్యాయం జరిగే వరకు ఎన్ని దాడులు చేసినా మా పోరాటం ఆగదన్నారు. హామీల అమలు మరిస్తే ప్రజలు కాంగ్రెస్‌ను వదలిపెట్టరన్నారు.

Exit mobile version