- లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు బాగున్నాయి
- రాజకీయ కుట్రతోనే పడావు పెట్టారు
- రైతులకు అన్యాయం చేస్తున్నారు
- కాళేశ్వరం తెలంగాణకు జీవధార
- దాని పరిరక్షణకు రైతులు కదం తొక్కాలి
- చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణగా
కృష్ణా, గోదావరి జలాల ధారబోత - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శలు
- కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
Kaleshwaram Water Dispute | చంద్రబాబుకు గురు దక్షిణ కింద కృష్ణా, గోదావరి జలాలను సీఎం రేవంత్ రెడ్డి అప్పగిస్తున్నాడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం బరాజ్‌లను పడావు పెట్టి.. వేల కోట్ల ఇసుక దందాతో కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకొంటున్నారని ఆరోపించారు. నీళ్లు ఇవ్వకుండా రైతుల పొలాలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంతో 50వేల ఎకరాలకు నీళ్లివ్వలేదని, కట్టిన మూడేళ్లలో కూలిపోయిందంటూ రేవంత్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు వాస్తవాలపై సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల నుంచి సూర్యాపేట, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు తీసుకురాలేదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో కౌంటర్ ఇచ్చారు. కన్నెపల్లి పంప్‌ల నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యాపేట జిల్లాలోనే 2.50 లక్షల ఎకరాలకు సాగునీరందించామని చెప్పారు. 42లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ఫ్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ పవర్ పాయింట్ ద్వారా ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిని చూశాక రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఎవరిని శిక్షించాలో రైతులు నిర్ణయించాలన్నారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా సంవత్సరానికి 10 నెలలు నీళ్లు ఎత్తవచ్చన్నారు. కేసీఆర్ చేతికి ప్రాజెక్టు అప్పగిస్తే నాలుగు రోజుల్లో సూర్యాపేట సీతారాంతండాకు నీళ్లు అందిస్తానన్నారు. లేనట్లయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని జగదీశ్‌రెడ్డి సవాల్ చేశారు. రైతులకు అన్యాయం జరుగుతున్నందునే తాను ఈ రోజు సవాల్ చేయాల్సి వస్తున్నదని చెప్పారు. ‘నీళ్లు ఇవ్వకపోతే మా చిన్న సీతారాంతండా రైతుతో చెప్పు దెబ్బ తింటాను,. నీళ్లు ఇస్తే అదే రైతుతో నీవు చెప్పు దెబ్బ తినేందుకు సిద్ధమా?’ అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్‌లాగ.. బనచర్ల, దేవాదుల ఎక్కడుందో తెలియకుండా మాట్లాడటం లేదని, స్వయంగా ఆ బరాజ్‌లు, పంప్ హౌజ్‌లు తిరిగి చూసి చెబుతున్నానన్నారు. ఈ నీళ్లు కాళేశ్వరం నుంచి కాదు.. పోచంపాడు నుంచి వస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారన్న జగదీశ్‌రెడ్డి.. మరి ఇప్పుడెందుకు పోచంపాడు నుంచి తమ ప్రాంతానికి నీళ్లు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
వారి అవగాహన రాహిత్యంతో తెలంగాణ రైతులకు అన్యాయం
ఏడాదిన్నర కాలం నుంచి రేవంత్ రెడ్డి తన గురువులు చంద్రబాబు, నరేంద్ర మోదీల మద్దతుతో అబద్దాలు చెప్పడం.. వారి మీడియాతో అబద్దాలు ప్రచారం చేయడం అలవాటుగా మార్చుకున్నారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సరైన అవగాహన లేని రేవంత్ రెడ్డి, మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణంగా రాష్ట్ర రైతాంగం ఆగమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు నీళ్లు రాలేదంటూ మాట్లాడుతున్నారని.. ఆ నీళ్లతో సాగుచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని అడిగితే వారికి వాస్తవాలు అర్ధమవుతాయని చెప్పారు. కేసీఆర్ నాలుగేళ్లు ఇచ్చిన కాళేశ్వరం నీళ్లు ఇప్పుడెందుకు ఇవ్వడం లేదో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు చెప్పాలన్నారు. రైతులంతా కేసీఆర్ వెంట నడిచి, కాళేశ్వరం పంపులు ఆన్ చేసేందుకు సిద్దం కావాలని, తెలంగాణ జీవధార కాళేశ్వరం పరిరక్షణ పోరాటంలో సూర్యాపేట రైతులు ముందుండాలని పిలుపునిచ్చారు. కన్నెపల్లి పంపులు నడిపితే సూర్యాపేట జిల్లాకు గోదావరి నీళ్లు అందుతాయన్నారు. తాజాగా తాను కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద పరిస్థితులు పరిశీలించానని.. అక్కడ మోటర్లు నడిపేందుకు తగిననీటి మట్టం ఉన్నప్పటికి మోటర్లు ఆన్ చేయడం లేదని తెలిపారు. మేడిగడ్డ బరాజ్‌పై వాస్తవ పరిస్థితిని ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. కూలిపోయిందన్న మేడిగడ్డ బరాజ్‌పై వాహనాల రాకపోకల దృశ్యాలను అందులో చూపించారు.
ఎన్డీఎస్ఏ ముసుగులో కాళేశ్వరంపై కుట్ర
20 నెలలుగా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న బరాజ్‌లు, పంప్‌హౌజ్‌లన్నింటినీ తాను స్వయంగా 12, 13వ తేదీల్లో పరిశీలించి, ఆ వీడియోలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ప్రజల ముందు ఉంచుతున్నానని జగదీశ్‌రెడ్డి తెలిపారు. అన్ని ప్రాజెక్టులు బాగున్నాయని చెప్పారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలాయని చెప్పారు. రికార్డు స్థాయి వరద రావడంతోనే అవి కుంగిపోయాయని తెలిపారు. వాటితో నష్టం లేకున్నా.. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును మూలపడేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు ఇబ్బందులు వస్తే మరమ్మతులు చేసుకుని వాడుకుంటారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయడం లేదని విమర్శించారు. ఏమన్నా అంటే ఎన్డీఎస్ఏ పేరు చెబుతున్నారని.. వారు కట్టిన పోలవరం కొట్టుకుపోతేనే దిక్కు లేదని గుర్తు చేశారు. ఎన్డీఎస్ఏ ఆగమేఘాల మీద వచ్చి కాళేశ్వరంపై రిపోర్టు తయారు చేసి ఎన్నికల ముందు కిషన్ రెడ్డికి ఇచ్చిపోయారని ఆరోపించారు. కాళేశ్వరం అంటే 3 బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్ లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141టీఎంసీల నిల్వ సామర్ధ్యం, 530మీటర్ల ఎత్తు, 240టీఎంసీల నీటి వినియోగంతో కూడిన భారీ వ్యవస్థ అని వివరించారు.
వాస్తవ పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్
ఒక్క పిల్లర్ భాగం పునర్నిర్మిస్తే మేడిగడ్డ బరాజ్‌ను వాడుకోవచ్చని జగదీశ్‌రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరి నీళ్లను ఎత్తిపోసే తొలి పంప్ హౌజ్ కన్నెపల్లి వద్ద ప్రస్తుతమున్న నీటి మట్టాలను వీడియోలతో సహా వివరించారు. సరస్వతి (అన్నారం) బరాజ్ కూడా రిపేర్‌కు వచ్చిందని చెబుతూ దాన్ని నింపడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారం బరాజ్‌కు ఎక్కడా రిపేర్లు అవసరం లేదని చెప్పారు. అన్నారం నుంచి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ, బస్వాపూర్, గంధమల్ల, ఎల్ఎండీలకు. కాకతీయ కాలువతో మైలవరం, బయ్యన్నవాగు, వెలిశాల మీదుగా.. ప్రగతి నగర్ నుంచి సూర్యాపేటకు గోదావరి జలాలు పారే వ్యవస్థను ఆయన వివరించారు.
తెలంగాణ నీటిపారుదల సలహాదారు చంద్రబాబు మనిషే
ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టులు కొట్టుకుపోయినా ఆనాటి టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఆ విషయాలను బయటపెట్టుకోలేదని.. కానీ ఇంటి దొంగల్లా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరంపై రచ్చ చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ కోసం కృష్ణ నదిపై 350టీఎంసీల ప్రాజెక్టులను ఎలాంటి అనుమతులు లేకుండా కట్టారన్నారు. కానీ ఆనాటి సీఎంలు చంద్రబాబు, వైఎస్ బయటపెట్టుకోకుండా వ్యవహరించారన్నారు. బనకచర్లకు అనుమతి రావడం కోసమే రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని పడావు పెడుతున్నారని ఆరోపించారు. పైగా బరాజ్‌ల నుంచి వేల లారీల్లో ఇసుక దందాతో వేల కోట్లు ఆర్జిస్తున్నారని విమర్శించారు. రాత్రిపూట 9 కిలోమీటర్ల పొడవున ఇసుక లారీలు బారులుగా పోతున్న వీడియోలను జగదీశ్‌రెడ్డి ప్రదర్శించారు. ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాలను తీసుకెళతామని బీజేపీ, దుమ్ముగూడెం నుంచి ఏపీకి తీసుకెళ్లాలని వైఎస్ ప్రయత్నించారని.. అదే రీతితో మళ్లీ బనకచర్లతో గోదావరి జలాలను ఎత్తుకెళ్లాలని చూస్తున్నారని వివరించారు. దీనిపై తెలంగాణ రైతాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రపంచంలో కొట్లాటకు వచ్చినోడితో చర్చలు పెట్టవచ్చు కానీ దొంగతనానికి వచ్చినోడితో రేవంత్ రెడ్డి చర్చలు చేస్తున్నాడని జగదీశ్‌రెడ్డి తప్పపట్టారు. చంద్రబాబు దగ్గర పనిచేసిన నీటి పారుదల కార్యదర్శిని తీసుకొచ్చి తెలంగాణ నీటి పారుదల సలహదారుడిగా నియమించుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకునే సలహదారుతో తెలంగాణ నది జలాల హక్కులు ఎలా రక్షిస్తారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, మాజీ గవర్నర్ నరసింహన్, సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్ ప్రశంసలు కురిపించిన విషయాన్ని జగదీశ్‌రెడ్డి ప్రస్తావించారు. హారాష్ట్ర అనుమతులు లేని కారణంగానే కాళేశ్వరంను కేసీఆర్ నిర్మించారని గుర్తు చేశారు.