పీసీ ఘోష్ కమిషన్ విచారణ సక్రమంగా జరగలేదు: హరీశ్ రావు
మిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 8బీ కింద తమకు నోటీసులు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సహజ న్యాయం, రాజ్యాంగం గురించి తాను మాట్లాడుతున్నానన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి 8బీ, 8 సీ కింద నోటీసులు ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉందని హరీశ్ రావు గుర్తుచేశారు

విధాత: కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 8బీ కింద తమకు నోటీసులు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సహజ న్యాయం, రాజ్యాంగం గురించి తాను మాట్లాడుతున్నానన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి 8బీ, 8 సీ కింద నోటీసులు ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉందని హరీశ్ రావు గుర్తుచేశారు. 8బీ కింద నోటీసులు ఇవ్వకపోతే ఆ కమిషన్ నివేదికలు చెల్లవని సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ సక్రమంగా జరగలేదని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీఘోష్ నివేదికపై బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీశ్ రావు చర్చలో పాల్గొన్నారు. పీసీఘోష్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ పై తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించారు.
అనంతరం చర్చలో హరీశ్ రావు పాల్గొన్నారు. కమిషన్ పై కోర్టుకు వెళ్లడం అనేది తమకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ఆయన గుర్తు చేశారు. గతంలో ఇలాంటి విషయాలపై ఇందిరాగాంధీ, అడ్వానీ కూడా కోర్టుకు వెళ్లారన్నారు. అర్జంటుగా ఆదివారం అసెంబ్లీలో కమిషన్ చర్చ పెట్టారంటే ప్రభుత్వ కుట్రలు అర్థం అవుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసిందంతా పొలిటికల్ డ్రామా అని ఆయన ఆరోపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగిందా లేదా అనేది తేలాలన్నారు. నిష్పాక్షికంగా జరగకపోతే ఆ కమిషన్ నివేదిక చిత్తు కాగితమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఆయనగుర్తు చేశారు. ఆరోపణలపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్టులో చెప్పిన విషయాన్ని హరీశ్ రావు ప్రస్తావించారు.
కాంగ్రెస్ ది అంతా పొలిటికల్ డ్రామా అని ఆయన విమర్శించారు. 8బీ, 8 సీ కింద నోటీసులు ఇవ్వనందున కోర్టుల్లో నిలబడవని ఆయన అన్నారు. గతంలో షా కమిషన్ పై దేశమంతా కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెట్టారని ఆయన గుర్తు చేశారు. షా కమిషన్ ను ఆనాడు నోటికి వచ్చినట్టు కాంగ్రెస్ నాయకులు తిట్టారన్నారు. చట్టాలను తుంగలో తొక్కుతూ ఏకపక్షంగా ఈ కమిషన్ ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. 8 బీ నోటీసులు ఇవ్వకుండా నివేదిక ఇచ్చారని ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టేసిందన్నారు. తనకు కానీ, కేసీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వలేదని ఆయన చెప్పారు. తమపై వేసిన కమిషన్ కూడా
రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు. 2015 ఫిబ్రవరి 18న ప్రాణహిత వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు.
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కూడా ప్రాణహిత నిర్మాణాన్ని వ్యతిరేకించాయన్నారు. ప్రాణహిత వద్ద 205 టీఎంసీల నీళ్లున్నాయని అప్పటి కేంద్ర మంత్రి ఉమా భారతి లేఖ రాసిన లేఖలో ఫస్ట్ పేజీనే పీసీఘోష్ కమిషన్ నివేదిక పరిగణనలోకి తీసుకొందన్నారు. కానీ, ఉమాభారతి రాసిన లేఖలో మూడో పేజీని కమిషన్ పట్టించుకోలేదని ఆయన అన్నారు. అందుకే పీసీ ఘోష్ నివేదికను తప్పుబడుతున్నామని ఆయన అన్నారు. ఉమా భారతి లేఖ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. ఎగువ రాష్ట్రాలు వాడుకున్నాక మిగిలేవి 102 టీఎంసీలు మాత్రమేనని ఆయన చెప్పారు.
తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ మధ్య 116 కి.మీ. దూరం ఉందన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి అనేక వాగులు వచ్చి కలవడం ద్వారా 120 టీఎంసీల నీరు అదనంగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రిటైర్డ్ ఇంజనీర్లను జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రశ్నించిందని ఆయన అన్నారు. తమ ఆలోచన ప్రకారమే అన్నారం, సుందిళ్ల కట్టారని విశ్రాంత ఇంజనీర్లు అఫిడవిట్ ఇచ్చారన్నారు. అన్నారం, సుందిళ్ల, మరో రెండు బరాజ్ లు కట్టి ఎల్లంపల్లి ద్వారా గోదావరి నీళ్లు తెచ్చారన్నారు. విశ్రాంతి ఇంజనీర్ల సూచనలు జస్టిస్ ఘోష్ పట్టించుకోలేదా.. తాము పట్టించుకోలేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు.
కమిషన్ తనను పిలిచి అనేక ప్రశ్నలు వేసిందని ఆయన అన్నారు. నీళ్లు లేకపోవడం వల్లే మేడిగడ్డకు మార్చారని నిపుణుల కమిటీ చెప్పిందన్నారు.ఘోష్ కమిషన్ కు అప్పటి ఈఎన్‌సీ మురళీధర్ లేఖ ఇచ్చారని హరీశ్ రావు గుర్తు చేశారు. కాళేశ్వరం డీపీఆర్ ను సీడబ్ల్యూసీకి పంపినట్టు చెప్పారు. డీపీఆర్ లో తప్పులుంటే కేంద్రం నుంచి అనుమతులు రావన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఎన్డీఎస్ఏ బిల్లును ఉత్తమ్ వ్యతిరేకించారని హరీశ్ రావు చెప్పారు. అన్ని రాష్ట్రాలను ఎన్డీఎస్ఏ ఒకేలా చూడాలన్నారు.
పోలవరం ప్రాజెక్టు పదిసార్లు కూలిపోతే ఎన్‌డీఎస్ఏ ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. పోలవరం కట్టిన సమయంలో చైర్మన్ గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ నాయకత్వంలో ఎన్డీఏస్ఏ ఛైర్మన్ గా మేడిగడ్డపై రిపోర్ట్ ఇచ్చిందన్నారు. 10 సార్లు కూలిన పోలవరం కట్టిన సమయంలో వ్యక్తి ఛైర్మన్ గా ఉన్న ఎన్డీఎస్ఏ నివేదిక రిపోర్టు పారదర్శకంగా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. ఎస్ఎల్ బీ సీ, సుంకిశాల, వట్టెం పంప్ హౌస్ గురించి ఎన్డీఎస్ఏ పట్టించుకోదా అని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డపై ఎన్‌డీఎస్ఏపై కక్ష ఎందుకు అని ఆయన అడిగారు. ఏడో బ్లాక్ ను రిపేర్ చేస్తే దీన్ని వాడుకోవచ్చని ఎన్డీఏస్ఏ తెలిపిందన్నారు. అన్నారం, సుందిళ్ల పర్ ఫెక్ట్ గా ఉన్నాయని ఆయన అన్నారు. రూ. సుమారు 300 కోట్లతో మరమ్మత్తులు చేసి నీళ్లు ఇచ్చే దానికి ఇంత రాద్దాంతం ఎందుకని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో కూలింది మూడు పిల్లర్లే అని ఆయన అన్నారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరును పూర్తి చేసింది తామేనన్నారు. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మకు కాళేశ్వరం నుంచి నీళ్లు అందుతున్నాయని ఆయన అన్నారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరును పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన గంధమళ్లకు కాళేశ్వరం నుంచే నీళ్లు అందుతున్నాయని ఆయన అన్నారు. అయితే హరీశ్ రావుకు ఇచ్చిన సమయం కంటే ఎక్కువే మాట్లాడారని, పదే పదే ప్రసంగాన్ని ముగించాలని స్పీకర్ కోరారు. కానీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మాట్లాడాలని స్పీకర్ కోరారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు హరీశ్ రావు ప్రసంగం పూర్తి చేసేందుకు అవకాశం ఇవ్వాలని నిరసనకు దిగారు.