సోనియా గాంధీని బలి దేవత అన్నాడు.. ఆయన్నే పీసీసీ అధ్యక్షునిగా నియమించారు: హరీశ్‌రావు

సోనియా గాంధీని బలి దేవత అన్నాడు.. ఆయన్నే పీసీసీ అధ్యక్షునిగా నియమించారు: హరీశ్‌రావు
  • రామాయంపేట సభలో మంత్రి హరీష్ రావు
  • రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ‘టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో.. బయట ఆరోపణలు చేసి, అధ్యక్షురాలు సోనియాగాంధీని బలి దేవత అన్నాడు. ఇప్పుడు అదే పార్టీని అధికారంలోకి తెస్తా అంటున్నాడు. ఆయన మాటలు అప్పుడు అబద్ధాలా? ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు అబద్దమా?’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆయన ఊసర వెళ్లులకే ఊసర వెళ్ళి, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారి మాట్లాడుతాడని ఆర్థిక మంత్రి హరీశ్ రావు దుయ్య బట్టారు.



సోమవారం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో కొత్త రెవెన్యూ డివిజన్ ఆఫీస్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ప్రారంభించారు. రూ.45 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. స్వలాభం కోసం పార్టీలు మార్చడం, మాటలు మార్చడం రేవంత్ రెడ్డి నైజం అన్నారు.


 గతంలో పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి, ఇప్పుడు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి చర్చిద్దామని ఆయన అంటున్నారని… అసలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఆయన టీడీపీ లో ఉండి కాంగ్రెస్ పార్టీని విమర్శించిన విషయం అందరికి తెలిసిందే అన్నారు.



అప్పుడు సోనియా గాంధీని బలి దేవత అని విమర్శించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు దేవత అంటున్నారని ఎద్దేవా చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకుండ ప్రజలను దగా, మోసం చేసిందన్నారు. నువ్వు ఆనాడు చెప్పింది నిజమా.. ఇప్పుడు చెప్పేది నిజమా అని రేవంత్ ను హరీశ్ రావ్ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన అని దుయ్యబట్టారు.



 వందలాది మంది చావుకి కారణమైన కాంగ్రెస్ నాయకులు తెలంగాణను ఉద్దరిస్తారా అని ప్రశ్నించారు. సంక్రాంతికి గంగి రెద్దుల వాళ్ళు వచ్చినట్టు ఎలక్షన్ రాగానే కొందరు హైదరాబాద్ నుంచి డబ్బు సంచులతో వస్తున్నారని పరోక్షంగా మైనంపల్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మెదక్ లో ధన బలానికి, జన బలానికి మధ్య పోటీ జరగనుందన్నారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టిన రామాయంపేట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం

రామాయంపేట రెవెన్యూ డివిజన్ నూతన కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. తూప్రాన్ అర్డీఓగా ఉన్న జయచంద్రా రెడ్డిని రామాయంపేట రెవెన్యూ డివిజన్ అధికారిగా నియమించారు. అయనను సీట్లో కూర్చు బెట్టిన మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి లు అభినందించారు.



 



ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా,అదనపు కలెక్టర్ రమేష్, మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, పుట్టి విజయ లక్ష్మి, సారాఫ్ యాదగిరి, దేవేందర్ రెడ్డి, నియోజక జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.