గుబాళించేది.. గులాబీనే! వోటా సంస్థ పోల్ సర్వేలో వెల్లడి

- బీఆరెస్‌కు 36 శాతం ఓట్లు
- కాంగ్రెస్‌కు 31%, బీజేపీ 9%
- పోటా పోటీ అన్నవారు 15%
- సీఎంగా కేసీఆర్‌కు 38% మద్దతు
- కానీ.. సిటింగ్‌లపై తీవ్ర ఆగ్రహం
విధాత : తెలంగాణ ఓటర్ల నాడి మరోసారి అధికార బీఆరెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉందని, గులాబీ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని వోటా పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో వెల్లడైంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కే అత్యధికులు ఆమోదం తెలిపినప్పటికీ.. సిటింగ్‌లపై దాదాపు అదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడం గమనార్హం. బీఆరెస్ ప్రకటించిన జాబితాలో కొందరికి టికెట్ నిరాకరించే అవకాశాలు ఉన్నాయని మెజర్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు. బీఆరెస్, బీజేపీ మధ్య రహస్య అవగాహన లేకపోవచ్చని సర్వేలో పాల్గొన్న అధికులు విశ్వసించారు. రానున్న ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి? అన్న ప్రశ్నకు 36 శాతం మంది బీఆరెస్‌కేనని చెప్పారని సర్వే సంస్థ తెలిపింది. కాంగ్రెస్‌కు 31% మంది, బీజేపీకి 9% మంది అనుకూలత వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. ఎన్నికల్లో బీఆరెస్, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ ఉంటుందని 15% మంది అభిప్రాయపడ్డారు. ఇతరులకు అనుకూలంగా 8శాతం మంది, నోటాకు 1శాతం మంది మద్దతుగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. సర్వేలో కాంగ్రెస్ పార్టీ కేవలం 5 శాతం ఓట్ల తేడాతో రెండో స్థానంలో కొనసాగుతున్నట్లుగా తేలింది.
ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కే జై
ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఎవరు అన్న ప్రశ్నకు సీఎం కేసీఆర్‌కు 38శాతం మంది మద్దతు తెలిపారు. రేవంత్‌రెడ్డికి 29శాతం, కేటీఆర్‌కు 16శాతం, కిషన్‌రెడ్డికి 8శాతం, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు 3శాతం మద్దతు ప్రకటించారు. 6శాతం మంది చెప్పలేమన్నారు. మీ ఎమ్మెల్యేను తిరిగి ఎన్నుకుంటారా? అన్న ప్రశ్నకు 34 శాతం మంది మళ్లీ ఎన్నుకుంటామని చెప్పారు. 37 శాతం ఎన్నుకోబోమని తెలిపారు. చెప్పలేమని 6శాతం, ఇతరులకు అవకాశమిస్తామని 23 శాతం మంది పేర్కొన్నారు.
బీఆరెస్ హ్యాట్రిక్ విజయం
బీఆరెస్ హ్యాట్రిక్ సాధిస్తుందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు అవునని 36శాతం మంది బదులిచ్చారు. కాదని 27 శాతం, చెప్పలేమని 31శాతం, హంగ్ వస్తుందని 6శాతం మంది అభిప్రాయ పడ్డారు. బీఆరెస్-బీజేపీల మధ్య రహస్య అవగాహన ఉందని నమ్ముతున్నారా? అన్న ప్రశ్నకు అవునని 37% మంది, కాదని 41%, ఉండవచ్చని 19%, తెలియదని 3% మంది చెప్పారు.
టికెట్లు పొందినవారిలో కొందరికి బీఫారాలు డౌటే!
టికెట్లు ప్రకటించిన వారందరికీ బీఆరెస్ బీఫారాలు ఇస్తుందా? అన్న ప్రశ్నకు ఇస్తుందని 31% మంది చెప్పారు. ఇవ్వదని 29 శాతం చెబితే.. కొందరికి ఇవ్వకపోవచ్చని 36 శాతం మంది చెప్పడం విశేషం. తమకు తెలియదని 4శాతం మంది పేర్కొన్నారు.
తెలంగాణ సాధనలో బీఆరెస్‌నే కీలకం
ప్రత్యేక తెలంగాణ ఎవరి వలన వచ్చిందనుకుంటున్నారన్న ప్రశ్నకు బీఆరెస్‌తోనే వచ్చిందని 39శాతం మంది చెప్పారు. కాంగ్రెస్‌తో వచ్చిందని 36%, బీజేపీతో వల్లేనని 9%, కాంగ్రెస్-బీఆరెస్ రెండు పార్టీలతోనే వచ్చిందని 16% మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సర్వే జరిగిందిలా..
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 11,900 శాంపిల్స్‌తో వోటా పొలిటికల్ కన్సల్టెన్సీ తన సర్వే నిర్వహించింది. 18-35 సంవత్సరాల వయసువారిని 53శాతం, 36-45 సంవత్సరాల వయసువారిని 29 శాతం, 46 సంవత్సరాల పైబడిన వయసున్న18 శాతం మంది అభిప్రాయాలు సేకరించారు. అందులో 52% పురుషులు, 48% మహిళలు పాల్గొన్నట్లుగా సంస్థ తెలిపింది.