‘అందెశ్రీని ప్రపంచానికి పరిచయం చేసింది సమాచార శాఖనే’

ప్రజాకవి అందెశ్రీ ని ప్రపంచానికి పరిచయం చేసింది ఉమ్మడి రాష్ట్ర సమాచార శాఖనే అని సమాచార, పౌర సంబంధాల శాఖ పూర్వ స్పెషల్ కమిషనర్ జీ ఎన్ ఫణి కుమార్ అన్నారు.

  • By: TAAZ |    telangana |    Published on : Dec 14, 2025 8:04 PM IST
‘అందెశ్రీని ప్రపంచానికి పరిచయం చేసింది సమాచార శాఖనే’

విధాత, హైదరాబాద్:
ప్రజాకవి అందెశ్రీ ని ప్రపంచానికి పరిచయం చేసింది ఉమ్మడి రాష్ట్ర సమాచార శాఖనే అని సమాచార, పౌర సంబంధాల శాఖ పూర్వ స్పెషల్ కమిషనర్ జీ ఎన్ ఫణి కుమార్ అన్నారు. అప్పటికే ప్రముఖ కవిగా ఉన్నప్పటికీ 2001లో అందెశ్రీని ప్రపంచానికి తన పాటలను రాయించడం ద్వారా పరిచయం చేసింది సమాచార శాఖనే అని ఆయన తెలిపారు.

సమాచార, పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల (తెలంగాణ, ఏపీ) వార్షిక ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఖైరతాబాద్ లోని రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశపు హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఐఏఎస్ అధికారి, సమాచార శాఖ పూర్వ స్పెషల్ కమిషనర్ జీ.ఎన్ ఫణికుమార్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా ఫణి కుమార్ మాట్లాడుతూ, 2001లో జరిగిన మహిళా జన్మభూమి కార్యక్రమానికి సమాచార శాఖ ఆహ్వానంపై అందెశ్రీ ఎన్నో ఉత్తేజకరమైన పాటలు రాసారని తెలిపారు. అయితే ఆ పాటల్లో తెలంగాణకు వ్యతిరేకంగా గానీ, కించపరుస్తూ రాయనని తనకు స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.

అన్ని ప్రభుత్వ శాఖల్లో సమాచార, పౌర సంబందాల శాఖ ఎంతో విశిష్టమైనదని, ఎంతటి క్లిష్టమైన మెగా ఈవెంట్లను కూడా అతితక్కువ వ్యయంతో కష్టపడి విజయవంతం చేస్తారని అన్నారు. అలాంటి అధికారులు, సిబ్బంది ఉండడం కేవలం సమాచార శాఖలోనే సాధ్యం అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు ఇతర ప్రముఖులతో ప్రత్యక్షంగా పనిచేసే శాఖ కేవలం ఇదేనని ఆయన అన్నారు. ఇంటలిజెన్స్ తో సమానంగా సమాచార శాఖ పనిచేస్తుందని, ప్రభుత్వానికి కళ్ళు, చెవుల మాదిరిగా ఉండే ఈ శాఖ కు ఎప్పుడూ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. రిటైర్డ్ డైరెక్టర్లు కిస్మత్ కుమార్, సుభాష్ గౌడ్, సత్యా రావు, శ్రీనివాస్, ప్రమోద్ రావు తదితరులు పాల్గొన్నారు.