Hate Speech Bill | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు’పై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లును పౌర స్వేచ్ఛను హరించే ఒక ‘క్రూరమైన ఆయుధం’గా అభివర్ణించారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రభుత్వం తన విమర్శకుల నోళ్లు మూయించేందుకే ఇటువంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని మండిపడ్డారు.
ఈ బిల్లు చట్టరూపం దాల్చితే రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు వాటిల్లుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత అస్పష్టంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. “అమలు యంత్రాంగం ఆధారాల కంటే అధికారుల వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. ఇది కచ్చితంగా దుర్వినియోగానికి దారితీస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
బిల్లులో ఉపయోగించిన ‘వ్యతిరేక భావాలు ప్రేరేపించడం’, ‘సామాజిక సమగ్రతను దెబ్బతీయడం’ వంటి పదాలకు స్పష్టమైన న్యాయ పరిమితులు లేవని కేటీఆర్ ఎత్తిచూపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ పదజాలాన్ని పొందుపరిచారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తే వాటిని ‘ఫేక్ న్యూస్’గా ముద్రవేసి జైలుకు పంపే ప్రమాదం పొంచి ఉందన్నారు.
‘శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. కేవలం ప్రత్యక్ష హింసకు ప్రేరేపించే మాటలపైనే నియంత్రణ ఉండాలని, విమర్శ లేదా వ్యంగ్యం శిక్షార్హం కాదని కోర్టు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. ఈ పరిమితిని మించి చట్టాలు చేయడం ఆర్టికల్ 19(1)(a) ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు.
ఏడు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్షలను ప్రతిపాదించడం ద్వారా ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించాలని ప్రభుత్వం చూస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, విద్యార్థులు, సామాన్యులు తమ తమ అభిప్రాయాలను పంచుకోవాలంటేనే భయపడేలా ఈ శిక్షలున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో హేట్ స్పీచ్‌పై తగినన్ని చట్టాలు ఉండగా, అదనంగా ఈ చట్టం తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. వెంటనే ఈ బిల్లును పునర్విమర్శించాలని, ప్రజాస్వామ్య విలువులను గౌరవిస్తూ అణచివేత ధోరణిని వీడాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
