Heavy Rains | తెలంగాణకు భారీ వర్ష సూచన.. మరో నాలుగు రోజులు కుండపోత వర్షాలు..!
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణ వ్యాప్తంగా వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. దారులు ఏరులై పారగా, వాగులు వంకలు, కుంటలు, చెరువులు పొంగిపొర్లాయి.

Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణ వ్యాప్తంగా వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. దారులు ఏరులై పారగా, వాగులు వంకలు, కుంటలు, చెరువులు పొంగిపొర్లాయి. భారీ వర్షానికి జన జీవనం స్తంభించిపోయింది. పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్ నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో 12.9 సెం.మీ., హైదరాబాద్ నగరంలో మారేడుపల్లిలోని పికెట్ ప్రాంతంలో 11.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ఇక రాబోయే నాలుగు రోజుల పాటు అంటే శనివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ఈ నెల 19న సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో, ఈ నెల 20న రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో, 21న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో, 22న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.