4 రోజులు వ‌ర్ష సూచ‌న‌.. అల్పపీడన ద్రోణి ప్ర‌భావంతో వాన‌లు

4 రోజులు వ‌ర్ష సూచ‌న‌.. అల్పపీడన ద్రోణి ప్ర‌భావంతో వాన‌లు
  • హైదరాబాద్‌తోపాటు ప‌లు జిల్లాల్లో వ‌ర్షం
  • హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డి



విధాత‌: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగ‌ళ‌వారం తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నద‌ని, దీని ప్రభావంతో దక్షిణ భారతంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నద‌ని పేర్కొన్న‌ది.


ద‌క్షిణ భార‌తదేశంలోని తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల‌తోపాటు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్త రు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.


వచ్చే నాలుగు రోజులు హైదరాబాద్‌ సహా మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మేడ్చల్‌ మల్కాజిగిరి, వరంగల్‌, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న‌ది.


మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డ్డాయి. ప‌లు జిల్లాల్లో మోస్త‌రు వాన‌లు ప‌డ్డాయి. న‌ల్లగొండ‌లోని ప‌లు మండ‌లాల్లో భారీ వ‌ర్షం కురిసింది.