విధాత : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నియోజకవర్గం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, ఆర్.వీ. కర్ణన్ తుది ఓటర్ల జాబితా వివరాలను వెల్లడించారు. తుది జాబితా ప్రకారం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3లక్షల 98 వేల 982 మంది ఉన్నట్లుగా తెలిపారు.
పురుష ఓటర్లు 2,07,367, మహిళా ఓటర్లు 1,91,590, ఇతరులు 25 మంది ఉన్నారని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఆక్టోబర్ రెండో వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈసీ ఇప్పటికే కేంద్ర ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకే పరిశీలకులను నియమిస్తున్నట్లు వెల్లడించింది. వీరు ప్రధానంగా అభ్యర్థులు చేసే ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక నిఘా పెడతారు. నియోజకవర్గంలో 139 భవనాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.