KTR : ఓడిన చోటే గెలిచి చూపిద్దాం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిన చోటే గెలిచి చూపించాలని కేటీఆర్ పిలుపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అక్రమాలతోనే కాంగ్రెస్ గెలిచిందని కేటీఆర్ ఆరోపణలు.

KTR

విధాత, హైదరాబాద్ : ఓడిన చోటే గెలిచి చూపిద్దామని..ఇందుకోసం జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేడర్ కు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు, అక్రమాలతోనే కాంగ్రెస్ గెలిచిందని, కర్ణాటక నుంచి మనుషులను తెచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారని, షేక్ పేట, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో రిగ్గింగ్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని, డబ్బు, మద్యం పంచి గెలిచారని, ఇది నైతిక గెలుపు కాదని విమర్శించారు. వ్యక్తిగత విషాదంలో ఉన్నా హరీష్ రావు పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.

దివంగత గోపీనాథ్ మరణం తర్వాత పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు. గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు. రేపు రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం, ఎమ్మెల్యే ఎన్నికల్లో వారు పడ్డ కష్టానికి మించి తాము పని చేస్తామని, “కాలికి బలపం కట్టుకొని తిరుగుతాం” అని కేటీఆర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కేడర్ పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తెలిపారు. జూబ్లీహిల్స్ లోని 407 బూతుల్లో ఒక్కో బూత్ కు 10 మంది చొప్పున, మొత్తం 4 వేల మందితో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకోవాలని సూచించారు. గతంలో నష్టపోయిన చోటే తిరిగి బలాన్ని పుంజుకోవాలని, “ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి” అనే సామెతను గుర్తు చేశారు. ప్రజల సమస్యలపై ఇప్పటి నుంచే పోరాటం మొదలుపెట్టాలని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమీక్షా సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Latest News