Uttam Kumar Reddy | కాళేశ్వరంను సర్వనాశనం చేసి..ఇప్పుడు దొంగ నాటకాలా : మంత్రి ఉత్తమ్
అస్తవ్యస్థ నిర్మాణంతో కాళేశ్వరం ప్రాజెక్టును సర్వనాశనం చేసిన బీఆరెస్ వాళ్లే మళ్లీ ఇప్పుడు నీళ్లు పంపింగ్ చేయమంటు దొంగనాటకాలాడుతున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు

మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే గోదావరి పరివాహక ప్రాంతాలకు ముంపు
కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రాణహిత-చేవేళ్ల స్థానంలో కాళేశ్వరం తెచ్చారు
అన్ని పంప్‌లు నడిపితే కరెంటు బిల్లులు ఏటా10వేల కోట్లు
నాడు నీళ్లు వదిలి..నేడు పంపింగ్ చేయమంటరా
బీఆరెస్ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫైర్
ఎల్లంపల్లిలో రేపటి నుంచి పంపింగ్ ప్రారంభిస్తాం
విధాత, హైదరాబాద్ : అస్తవ్యస్థ నిర్మాణంతో కాళేశ్వరం ప్రాజెక్టును సర్వనాశనం చేసిన బీఆరెస్ వాళ్లే మళ్లీ ఇప్పుడు నీళ్లు పంపింగ్ చేయమంటు దొంగనాటకాలాడుతున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం పంప్‌లు నడపాలంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారధ్యంలోని బీఆరెస్ ప్రజాప్రతినిధుల బృందం చేసిన డిమాండ్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ జలసౌధలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు బీఆరెస్ నేతలకు పిక్నిక్ స్పాట్‌గా మారిందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో పూర్తి సామర్థ్యంతో పంపింగ్ చేయాలని బీఆరెస్ చెబుతోందని, ఏదైనా ప్రమాదం జరిగితే మేడిగడ్డ సమీపంలోని 44 గ్రామాలు కొట్టుకుపోతాయని, భద్రాచలం పట్టణం నీట మునుగుతుందన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ప్రమాదమేర్పడుతుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. తాము ఎన్డీఏస్‌ఏ నిపుణుల బృందం సూచన మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో గోదావరి వరద జలాలు నిల్వ ఉంచకుండా గేట్లు ఎత్తిపెట్టడం జరిగిందన్నారు. ఎల్లంపల్లిలో రేపటినుంచి పంపింగ్ మొదలు పెడతామన్నారు. అన్నారం వద్ధ 11మీటర్ల వద్ధ పంపింగ్ ప్రారంభించాలను కుంటే 5మీటర్లకే బుంగలు పడ్డాయన్నారు. కేటీఆర్ మేడిగడ్డ బాగుందంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని, ఆయన పేరు జోసేఫ్ గోబెల్ అని పెట్టుకోవాలని ఉత్తమ్ సెటైర్లు వేశారు. కేటీఆర్ కంటే ఎన్డీఎస్‌ఏ నిఫుణుల బృందానికే తెలివి ఎక్కువుందని తాము భావిస్తున్నామన్నారు. బ్యారేజ్ లలో ఎవరూ 16 టీఎంసీల నీరు నిల్వ చేయరని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు నిల్వ చేయవద్దని ఎన్డీఎస్‌ఐ స్పష్టం చేసిందని వెల్లడించారు.
బీఆరెస్ హయంలోనే మేడిగడ్డ కుంగింది..క్షమాపణ చెప్పాలి
మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్ర చేస్తుందని బీఆరెస్ నేతలు ఆరోపించడం హాస్యాస్పదమని, మేడిగడ్డ బీఆరెస హాయంలోనే కుంగిందని, అప్పుడు వాళ్లే నీళ్లను కిందకు వదిలేసిన సంగతి మరువరాదని ఉత్తమ్ గుర్తు చేశారు. ఇప్పుడేమో మేడిగడ్డ నుంచి నీళ్లు పంపింగ్ చేయాలని బీఆరెస్ వాళ్లే కోరడం విడ్డూరంగా ఉందన్నారు. మేడిగడ్డలో పిల్లర్లు 6 అడుగులు లోపలికి కుంగాయని, నాసిరకంగా నిర్మించడం వల్లే బ్యారేజీ కుగిందని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందని పేర్కోన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కేంద్ర చట్టం ద్వారా ఏర్పాటు చేశారని, ఎన్డీఎస్ఏ నివేదికపైనా బీఆరెస్ ఆరోపణలు చేస్తోందన్నారు. మేడిగడ్డ మొదలు పెట్టినప్పుడు, కూలినప్పుడు కూడా బీఆరెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. ఆక్టోబరు 21న బ్యారేజ్ కుగిందని, మా ప్రభుత్వం ఏర్పడింది డిసెంబరులో అని గుర్తు చేశారు. మేడిగడ్డ వద్ద ఎవరో బాంబులు పెట్టినట్టు ఎఫ్‌ఐఆర్ కూడా ఫైల్ చేశారని, బ్యారేజీ కుంగినా కేసీఆర్ నోరు మెదపలేదని పేర్కోన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, బ్యారేజీల నిర్మాణాలలో డీపీఆర్ అంశాలను గత బీఆరెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సెంట్రల్ డిజైన్ సంస్థ ప్రకారం నిర్మాణం జరగలేదని, కేవలం ఒక వ్యక్తి ఆలోచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇంత ఘోర తప్పిదం ఎవరూ చేసి ఉండరని, ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో బీఆరెస్ నేతలు విహార యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కమిషన్ల కక్కుర్తి కోసమే రీడిజైన్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపివేసి రీడిజైన్ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రభ్వుత్వం నిర్మించం ద్వారా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేశారన్నారు. గోదావరి నదిపై ప్రాజెక్టులు కట్టాలని ఆనాడే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. అందులో భాగంగా వైఎస్ఆర్ తుమ్మిడిహట్టి దగ్గర శంకుస్థాపన చేశారని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.38,500 కోట్ల నుంచి రూ.90వేల కోట్లకు కేసీఆర్ పెంచారని, కాగ్ లెక్కల ప్రకారం ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.1.47లక్షల కోట్లు కావాలని ఉత్తమ్ పేర్కోన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రన్నింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువని, ప్రాజెక్టులోని అన్ని పంపులను పూర్తి స్థాయిలో రన్ చేస్తే కరెంటు బిల్లులే రూ.10వేల కోట్లు అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తయి అన్ని మోటార్లు రన్ చేస్తే ఈ వ్యయం ఇంకా పెరిగే అవకాశముందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం అధిక వడ్డీతో రుణాలు తీసుకున్నారని, ఏడాదికి కాళేశ్వరం నిర్వాహణకే రూ.15వేలకోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని, ప్రాజెక్టు పూర్తయితే అన్ని ఖర్చులు ఏటా 25వేల కోట్లు అవుతాయన్నారు. దాదాపు రూ.94 వేల కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరం కింద కేవలం 93 వేల ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందన్నారు.