Kavitha : నిజామాబాద్ లో నా ఓటమి కుట్ర

నిజామాబాద్‌లో తన ఓటమి వెనుక బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుట్ర ఉందని కవిత వ్యాఖ్యలు. జనం బాట యాత్రను సొంత గడ్డ నిజామాబాద్‌ నుంచి ప్రారంభించారు.

Kavitha : నిజామాబాద్ లో నా ఓటమి కుట్ర

విధాత : నిజామాబాద్ లో ఎంపీగా నా ఓటమి వెనుక బీఆర్ఎస్ పార్టీ ఇంటి మనుషుల కుట్ర దాగి ఉందని..ఈ విషయం ఇక్కడి ప్రజలందరికి తెలుసు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మీ గుండెల మీద చేయి చేసుకొని ఆలోచించండి..నా ఓటమికి కుట్ర జరిగిందా ? లేదా ? అయినా ఇన్నాళ్లు కేసీఆర్ పై గౌరవంతో, పార్టీపైన ప్రేమతో ఓపికగా భరించానన్నారు. ఇవ్వాళ అదే బీఆర్ఎస్ నుంచి నన్ను బయటకు పంపించారని..నేను పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదన్న సంగతి నా సొంత జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలన్నారు. ఇవ్వాళ ఇంటిగుట్టు అంతా బయటేసి నన్ను ఇబ్బంది పెడుతున్న సందర్బంలో మళ్లీ నా సొంత ప్రజల మధ్యకు నిజామాబాద్ గడ్డకు వచ్చానన్నారు. జనం బాటకు తొలి ఆశీర్వాదం కోసం మీ వద్దకు వచ్చానన్నారు. 33జిల్లాల నా జనం బాట పర్యటనను సొంత గడ్డపై నుంచి ప్రారంభించానని గుర్తు చేశారు.

శనివారం జనం బాట తొలి రోజు యాత్రలో భాగంగా నిజామాబాద్ లో పర్యటించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డియైనా…మరెవరైనా..ప్రభుత్వాలు ఏవైనా ఆడబిడ్డలను చిన్నచూపు చూస్తున్నాయని కవిత విమర్శించారు. కష్టపడితేనే ఫలితం అందుతుందని..ఏ ప్రభుత్వమైన అడుగందే ఇవ్వదన్నారు. రూ.2500ఆర్థిక సహాయం కోసం, పెంచిన పింఛన్ కోసం పిడికిలి బిగించి పోరాడాల్సిన అవసరముందన్నారు.

కవిత తన తొలి రోజ జనం బాటలో నవీపేట్ మండలం యంచ గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులతో సమావేశం అయ్యారు. వారి సమస్యలు విని పరిష్కరం కోసం ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై చర్చించారు. నిజామాబాద్ పసుపు రైతులు పలువురు కవిత జనం బాటకు సంఘీభావం తెలిపారు.