మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి: కల్వకుంట్ల కవిత

మేలోనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని కవిత డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల పెంపుపై మండిపడి, తల్లిదండ్రులకు ఉపశమనం కల్పించాలని కోరారు.

మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని, ఉచిత విద్య, వైద్యం మా పార్టీ విధానం అని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. 50 శాతం నుంచి 120 శాతం స్కూల్ ఫీజులు పెంచినా తెలంగాణ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అని, 1200 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో 12 ఏళ్లుగా ఆ సంవేదనతో పాలన సాగలేదు అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. మన రాష్ట్రంలో 64 లక్షల మంది విద్యార్థులు ఉంటే 65 నుంచి 75 శాతం వరకు ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతున్నారని తెలిపారు. పిల్లలు బాగా చదువుకోవాలన్న తల్లితండ్రుల వీక్ నెస్ ను వ్యాపార ధోరణిగా మార్చేశారని, ఈ ప్రభుత్వం కచ్చితంగా కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన జీవో ను తక్షణమే ఇవ్వాలని, ఇప్పుడు జీవో ఇస్తేనే లక్షలాది మంత్రి తల్లితండ్రులకు ఉపశమనం లభిస్తుందని కవిత అభిప్రాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచకుండా తక్షణమే జీవో ఇవ్వాలని అన్నారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ టార్గెట్ గా కవిత విమర్శలు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది ప్రభుత్వ స్థలంలో ఉన్న స్కూల్ అని, ఈ స్కూల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 120 శాతం ఫీజు పెంచేశారని కవిత తెలిపారు. ప్రభుత్వానికి చెందిన స్కూల్లోనే 120 శాతం ఫీజు పెంచటమంటే ఏంటీ దౌర్భాగ్యం అని, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ లకు వెళ్తూ ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రైవేట్ విద్యాసంస్థలను దోపిడీని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నట్లా? అని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 30 ఎకరాల భూమిని కొట్టేసే కుట్ర చేస్తున్నారని, అక్కడి కమిటీలో ముఖ్యమంత్రి బంధువులు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపించారు. అదే స్కూల్లో 14 ఏళ్లుగా ఒక పోస్ట్ లో మహిళ ఉన్నారని, ఆమె బోర్డులోకి వచ్చిన వారికి అవినీతి ఎలా చేయాలో నేర్పిస్తున్నారన్నారు. హైదరాబాద్ స్కూల్ లో చదివి గొప్ప వాళ్లు అయిన వాళ్లు డొనేషన్లు ఇస్తున్నారని, ఇటీవలే ఆ స్కూల్ పూర్వ విద్యార్థి సత్య నాదెళ్ల పెద్ద ఎత్తున విరాళం ఇచ్చారని, వాటన్నింటికీ అసలు ఎలాంటి లెక్క లేదు అని ఆరోపించారు.
విద్యాశాఖ మంత్రే ముఖ్యమంత్రి కావటం మన ఖర్మ అని కవిత విమర్శించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వ్యవహారంలో కచ్చితంగా ముఖ్యమంత్రి రివ్యూ చేయాలని, ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకోవాలని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 120 శాతం ఫీజు పెరిగితే…నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో ఎంత పెంచుతారు? అని కవిత నిలదీశారు.

పిల్లల చదువులలో ప్రభుత్వం బాధ్యత

పిల్లల చదువు బాధ్యత తల్లితండ్రులది మాత్రమే కాదని ప్రభుత్వ బాధ్యత కూడా అన్నారు. అసలు చదువుకు సంబంధించిన విధానం కొరవడిందని, హెల్త్, ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వాలకు అబ్లిగేషన్ గా ఉండాలని కవిత పేర్కొన్నారు. ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వాల భాద్యతేనని నమ్మిన ప్రభుత్వాలు ఉండాలని, కానీ ప్రజలు ఏమైతే మాకేంటీ, ఫీజులు ఎంత పెంచిన నిమ్మకు నీరెత్తినట్లు ఉంటామంటే కుదరదని కవిత స్పష్టం చేశారు. ఫీజులు కట్టలేక పంజాబ్ లో విద్యార్థులు పార్ట్ టైమ్ మద్యం అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని, ఇప్పుడున్న చాలా విద్యాసంస్థలు వ్యాపార ధోరణితో ఉన్నావేనన్నారు. వాటిలో రాజకీయ నాయకులకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. రాజకీయ నాయకులకే విద్యాసంస్థలు ఉండటమనేది కరెక్టా అనేది మనం ఆలోచించాలని, అదే విధంగా ఫీజుల దోపిడీకి మనకు ఇప్పుడే సొలుష్యన్ కావాలని, వచ్చే నెలలో మళ్లీ ఫీజులు కట్టాలన్న ఆందోళన పిల్లల తల్లితండ్రులకు ఉంటుందని, చాలా మంది తల్లితండ్రులు ఇప్పటికే ఫీజుల విషయంలో భయంతో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పై విమర్శలు

తెలంగాణ వచ్చాక ఫీజుల నియంత్రణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తిరుపతి రావు కమిషన్ వేసిందని,
ఆ కమిషన్ అధ్యయనం చేసి రిపోర్ట్ కూడా ఇచ్చిందని, కానీ ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని కవిత విమర్శించారు. గురుకులాలు ఏర్పాటు చేశామని…ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని పట్టించుకోమంటే కుదరదు అన్నారు. తెలంగాణలో చాలా మంది బడ్జెట్ స్కూళ్లను, కాలేజ్ లను నడిపించారని గుర్తు చేశారు. నిరుద్యోగుల తక్కువ ఫీజులతో నడిపించిన ప్రైవేట్ విద్యాసంస్థలను కార్పొరేట్ విద్యాసంస్థలు మింగేశాయన్నారు. ఎథిక్స్ తో నడిచే స్కూళ్లతో మాకు ఎలాంటి సమస్య లేదు అని, తెలంగాణ సమాజానికి సమస్య ఉందంటే…తెలంగాణ రక్షణ సేనకు కూడా సమస్య ఉన్నట్లేనన్నారు. ఫీజుల దోపిడీకి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటి కావాలని,
అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాల్సిన అవసరముందన్నారు.

జీవో నెంబర్ 7 ను రద్దు చేయాలి

ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దాదాపు 11 వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని, దీంతో కాలేజ్ లు మూతపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ను బొంద పెట్టే విధంగా ఎంఎస్ -7 అనే జీవోను తెచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత మండిపడ్డారు. పిల్లల తల్లితండ్రుల అకౌంట్ కు డబ్బులు వేస్తామంటున్నారని, ఒకవేళ ఫీజులు చెల్లించకుంటే తల్లితండ్రులు పోరాటం చేసే పరిస్థితి ఉండదన్నారు. రైతు భరోసా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. రైతు భరోసా వేయకపోతే రైతులు బయటకు వచ్చి పోరాటం చేసే పరిస్థితి లేదు అన్నారు. ఈ జీవో కొట్టివేసే వరకు అన్ని పార్టీలు పోరాటం చేయాల్సి ఉందని తెలిపారు.

ఉచిత విద్య, వైద్యంపై మాట తప్పను

ఉచిత విద్య, వైద్యం విషయంలో నేను మాట తప్పనని, నేను ఆడపిల్లను. అబద్దమాడను. ఇన్నాళ్లు అయ్యల పాలనలో మోసం జరిగిందని, కానీ నేను అమ్మలా ఆలోచించే వ్యక్తిని. కచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని కవిత స్పష్టం చేశారు. ఉచిత వైద్యం, విద్య ఇవ్వకపోతే అమరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టండన్నారు. మేము అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక నిపుణులతో చర్చించిన తర్వాత ఉచిత విద్య, వైద్యం అనే అంశాన్ని పెట్టాం అని, ఇవ్వాలనే మనసు ఉంటే కచ్చితంగా ఉచిత విద్య, వైద్యం ఇవ్వొచ్చు అన్నారు. తమిళనాడు తరహాలో మన వద్ద కూడా ఫీజు నియంత్రణ కోసం పర్మినెంట్ అథారిటీ ఉండాలని తెలిపారు. లేదంటే గుజరాత్ లో మాదిరిగా ప్రాథమిక విద్యకు 15 వేలు, ఉన్నత విద్యకు 25 వేలకు మించి ఫీజు ఉండొద్దన్నారు. ఇందులో ఏ మోడల్ ను అయిన స్టడీ చేసి ప్రభుత్వం వాటిని అమలు చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ
అన్నాడీఎంకేలో చిచ్చు పెట్టిన విజయ్‌ గెలుపు..

Latest News