‘ఇడుపు కాయితం’ అర్థం కావాలంటే పవన్‌ను అడగండి: కవిత సెటైర్లు

తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ వివాదంపై ఆసక్తికరంగా స్పందించారు. ‘ఇడుపు కాగితం’ పదానికి అర్థం పవన్ కల్యాణ్‌ను అడిగితే బాగా చెబుతాడని సెటైర్ వేశారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సైలెంట్‌గా ఉన్నాయని కవిత విమర్శించారు.

విధాత, హైదరాబాద్ : ఇటీవల షూటింగ్ మొదలుపెట్టుకున్న ఓ తెలుగు సినిమాకు తెలంగాణ యాస, భాషతో కూడిన ‘ఇడుపు కాయితం’ పేరు పెట్టడంపై ఆంధ్రా, తెలంగాణ వాదుల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల రచ్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ వివాదంపై ఆసక్తికరంగా స్పందించారు. ఉప్పల్‌లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన కవిత మాట్లాడుతూ..  ‘ఇడుపు కాగితం’ పదానికి అర్థం పవన్ కల్యాణ్‌ను అడిగితే బాగా చెబుతాడని సెటైర్ వేశారు. తెలంగాణ యాస, భాషను హేళన చేసినందుకే రాష్ట్రం ఏర్పడాల్సివచ్చిందని, మరోసారి అలాంటి వెకిలి ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు.

తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సైలెంట్‌గా ఉన్నాయని కవిత విమర్శించారు. రేవంత్ రెడ్డికి తెలంగాణకు సంబంధం లేదన్నారు. ఇక బీఆర్ఎస్ కూడా మాట్లాడదని, ఎందుకంటే  బీఆర్ఎస్ గుంటనక్క ఒకటి ఆంధ్రా  కార్పొరేట్ శక్తులతో వ్యాపారం చేస్తోందని పరోక్షంగా హరీశ్ రావుపై  కవిత మండిపడ్డారు. ఆ గుంటనక్కనే ఆంధ్రా విద్యాసంస్థలు, ఆసుపత్రులకు తన పాల సంస్థల ద్వారా పాలు సరఫరా చేస్తు లబ్ధి పొందుతున్నాడని ఆరోపించారు. అందుకే ఆ సంస్థలతో పాటు తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలు, యూనివర్సిటీలు,ఆసుపత్రులు తెలంగాణ విజయ డెయిరీ,మదర్ డెయిరీ వంటి ప్రభుత్వ డెయిరీల నుంచే పాలు కొనుగోలు చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందని, కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయలేక ప్రజలకు దూరమైందని కవిత విమర్శించారు. జీహెచ్ఎంసీ కార్పోరేషన్ల ఎన్నికల్లో టీఆర్ఎస్ అన్ని డివిజన్లలో పోటీ చేస్తుందని కవిత ప్రకటించారు.ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇస్తామన్న 250 గజాల స్థలం కోసం జులై 2న ఉప్పల్ భగాయత్‌లో భారీ భూపోరాటం చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.

Latest News