Stepwell । గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం శిథిలావస్థకు చేరుకున్న మెట్ల బావులను పునరుద్ధరిస్తున్నది. వాటికి కొత్త సొబగులు అద్ది పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నది. ఈ క్రమంలోనే గతంలో బన్సీలాల్‌పేట మెట్లబావి, గచ్చిబౌలి మెట్ల బావి వంటివాటికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. తాజాగా గుడిమల్కాపూర్‌లోని కుమందన్ బౌలిలోని మెట్ల బావిని సైతం పునరుద్ధరించేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దశాబ్దాలుగా పూడుకుపోయిన ఈ బావి నుంచి చెత్తను తొలగించనున్నారు. ఈ ప్రాజెక్టును నిర్మాణ్ ఎన్జీవో చేపట్టనున్నది. అందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) నిధులు సమకూర్చనున్నది. ఈ బావి పునరుద్ధరణకు కోటీ యాభై లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. బావి పునరుద్ధరణ ప్రణాళికకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. నిర్మాణ్ సంస్థతో త్వరలోనే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎంవోయూ కుదుర్చుకోనున్నారు.
1913 నాటి హైదరాబాద్ మున్సిపల్ ప్లాన్‌లో ఈ మెట్ల బావిని గుర్తించారు. జామ్‌సింగ్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ మెట్ల బావి ఉన్నది. దీనిని 1810లో నిర్మించినట్టు తెలుస్తున్నది. అప్పట్లో ఆలయ క్రతువుల కోసం దీనిని ఉపయోగించేవారు. కానీ.. కాలక్రమేణా ఇది నిర్మాణ వ్యర్థాలు, సమీప మార్కెట్ స్టాల్స్ నుంచి వచ్చే వ్యర్థాలతో నిండిపోయింది. దీని చుట్టూ ఉన్న ఆక్రమణలను ఇటీవలే జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ఎనిమిది అడుగుల మేర నిర్వహించిన తవ్వకాల్లో బావి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ బావి 18 అడుగుల వెడల్పు, 120 అడుగుల వెడల్పు, 30 అడుగుల లోతుతో ఉన్నట్టు గుర్తించారు.
బావి పునరుద్ధరణలో తొలి దశ పనులకు 18 నెలలు పడుతుందని అధికారులు అంచనా వేశారు. అనంతరం బావిని సుందరీకరించే పనులు చేపట్టనున్నారు. అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెట్ డిపార్ట్‌మెంట్ సైతం తగిన అనుమతులు జారీ చేసింది. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకే కాకుండా.. మార్కెట్ పరిసరాలను అందంగా మార్చుతుందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ప్రజలు సేదదీరేందుకు మంచి అవకాశం కలుతుందని అంటున్నారు. పునరుద్ధరించిన అనంతరం ఈ బావి చుట్టూ ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ వంటి ఏర్పాట్లు చేయనున్నారు. కమ్యూనిటీ పార్టిసిపేషన్‌లో ఈ బావిని తదుపరి నిర్వహిస్తారు.