చీకట్లోనే ఎంగిలిపూల బతుకమ్మ.. గ్రామాలను పట్టించుకునే నాథుడే లేడు
బతుకమ్మ పండగ వస్తుందంటే సంబరాలు చేసుకునేందుకు ఆడపడుచులు ఎక్కడి నుండో పుట్టిన గ్రామానికి ముందే చేరుకుంటారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో స్పెషల్ అధికారి, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించుకోవాలి కానీ, జిల్లా వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పత్తా లేకుండా పోవడంతో గ్రామాలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

జనగామ, సెప్టెంబర్ 21 (విధాత): బతుకమ్మ పండగ వస్తుందంటే సంబరాలు చేసుకునేందుకు ఆడపడుచులు ఎక్కడి నుండో పుట్టిన గ్రామానికి ముందే చేరుకుంటారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో స్పెషల్ అధికారి, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించుకోవాలి కానీ, జిల్లా వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పత్తా లేకుండా పోవడంతో గ్రామాలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బతుకమ్మ ఆట ఆడే కూడలిలో వెలుగులు లేక చీకట్లోనే పండుగ సంబరాలు చేసుకుంటున్నారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామంలో చీకట్లోనే పండగ సంబరాలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉందని మహిళలు వాపోయారు. కనీసం వీధిలైట్లు లేక పోవడంతో బతుకమ్మ కూడలికి బతుకమ్మను తీసుకురావాలంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతకమ్మ సంబరాలలో భాగంగా మొదటి రోజైనా ఎంగిలిపూల బతుకమ్మను చీకట్లోనే జరుపుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సద్దుల బతుకమ్మ వరకైనా బతకమ్మ కూడలి వద్ద వీధిలైట్లు ఏర్పాటుచేసి సంబరాలు నిర్వహించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.